మంగళవారం 26 మే 2020
Telangana - May 17, 2020 , 02:07:13

పదిరోజులే చికిత్స

పదిరోజులే చికిత్స

  • మరో 7 రోజులు హోం ఐసొలేషన్‌
  • ఐసీఎమ్మార్‌ కొత్త మార్గదర్శకాలు
  • అమలుచేస్తామన్న మంత్రి ఈటల 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తులకు పదిరోజులపాటు చికిత్స అందించిన తర్వాత ఎటువంటి పరీక్షలు చేయకుండానే డిశ్చార్జి చేయాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌) నూతన మార్గదర్శకాలు జారీచేసిందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇలా డిశ్చార్జి అయినవారిని మరో ఏడురోజులపాటు హోం ఐసొలేషన్‌లో ఉంచాలని, ఒక వేళ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్న, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని మాత్రమే దవాఖానలో ఉంచి చికిత్స అందించాలని ఐసీఎమ్మార్‌ నిర్దేశించిందన్నారు. ఐసీఎమ్మార్‌ తాజా మార్గదర్శకాల అమలుపై శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐసీఎమ్మార్‌ తాజాగా మార్గదర్శకాల ప్రకారం డిశ్చార్జి పాలసీ, హోం ఐసొలేషన్‌, డెత్‌ గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్నట్టు ప్రకటించారు. క్యాన్సర్‌, గుండె, లేదా ఇతర జబ్బులతో చనిపోయినవారికి కరోనా పాజిటివ్‌ ఉన్నా.. దీర్ఘకాలిక వ్యాధులతోనే మరణించినట్టుగా పరిగణించాలని కొత్త మార్గదర్శకాలు చెప్తున్నాయన్నారు. ఈ మరణాల కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు. వారిచ్చిన డెత్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ ప్రకారమే మరణాలను ప్రకటించాలని ఐసీఎమ్మార్‌ తెలిపిందని, ఇందుకు అనుగుణంగానే తెలంగాణలో మరణాలకు సంబంధించి నివేదికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. 

హోం ఐసొలేషన్‌ కోసం మే 10న విడుదలచేసిన సూచనల ప్రకారం ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కాంటాక్ట్‌లను లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించా ల్సి ఉంటుందన్నారు. ఇంట్లో ఒక ప్రత్యేక గదిలో 17 రోజులపాటు పర్యవేక్షణలో ఉం చాలని, వారికి సాయంగా ఒక వ్యక్తి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అలా సహాయం అందిస్తున్న వ్యక్తికి హెచ్‌సీక్యూ టాబ్లెట్లు అందించాలని తెలిపారని పేర్కొన్నారు. ఇలా హోం ఐసొలేషన్‌లో ఉన్నవారిని వైద్యబృందాలు ఉదయం, సాయం త్రం పరీక్షిస్తాయని, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను అందిస్తామని వెల్లడించారు. ఈ విధానం అమలులో సమన్వ యం కోసం ప్రత్యేక నోడల్‌ అధికారిని కూ డా నియమించామని తెలిపారు. 

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. హైదరాబాద్‌లో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని నోడల్‌ అధికారులు, వైద్యులతో మాట్లాడానన్నారు. ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి వైరస్‌ సోకడం వల్లే రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని, వీరందరికీ చికిత్స అందిస్తున్నామని వివరించారు. సమావేశంలో ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ వీసీ కరుణాకర్‌రెడ్డి, ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo