Minister Dayakar Rao | మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎక్కడికి వెళ్లినా జనంతో మమేకమవుతారు. ఆప్యాయంగా పలుకరిస్తూ బాగోగులు తెలుసుకుంటుంటారు. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు ప్రధాన రహదారిపై వాహనాన్ని నిలిపారు. రోడ్డు పక్కనే బండిపై ఫ్రూట్స్ సాలాడ్స్ విక్రయిస్తున్న దుకాణం వద్దకు వెళ్లారు. లస్సీని సేవించి.. మహిళా వ్యాపారితో సంభాషించారు. వ్యాపారం ఎలా ఉంది? బాగా నడుస్తుందా? అంటూ కుశల ప్రశ్నలు వేశారు? దీనికి స్పందించిన మహిళ మీరు చూపిన దారే సార్. మీరిచ్చిన అవకాశం వల్లే ఇవాళ మా కుటుంబం బతుకుతోంది.
మేమే కాదు మాలాగా చాలా కుటుంబాల ఐదువేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే మీ వల్లే సార్’ అంటు తెలిపారు. ‘మీరే కాదు మీలా అందరూ బాగుండాలె. అందులో మనముండాలె. సీఎం కేసీఆర్ దయతో ఫుట్పాత్ వ్యాపారులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రుణాలిస్తున్నది. నా వంతుగా నేను మీకు అండగా నిలబడ్డా’ అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లస్సీ తాగి.. డబ్బులు ఇవ్వగా మహిళ తీసుకునేందుకు నిరాకరించింది. మీకు ఏం చేసినా రుణం తీర్చుకోలేమని, డబ్బులు తీసుకోనని చెప్పగా.. తాను ఉచితంగా తాగేది లేదని, వ్యాపార ధర్మంగా తీసుకోవాలంటూ డబ్బులు అందించారు. స్వయంగా మంత్రి దుకాణం వద్దకు వచ్చి బాగోగులు తెలుసుకోవడంతో సదరు మహిళ సంతోషం వ్యక్తం చేసింది.