రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా ధ్యాన & సంగీత లైవ్ షో కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి.. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు, పండిత్ హరిప్రసాద్ చౌరాసియాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల పక్షాన స్వాగతం పలికారు. చౌరాసియా అంతర్జాతీయ గుర్తింపు కలిగిన గొప్ప వేణుగాన (పిల్లనగ్రోవి) విద్వాంసులనే విషయాన్ని గుర్తుచేశారు.
ఆయన సంగీతం వీనుల విందుగా ఉంటుందని, ఎంతో మధురమైన సంగీతం అందిస్తారని కొనియాడారు. తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే సిరివెన్నెల చిత్రంలో పాటలకు వేణుగాన సహకారం అందించింది హరిప్రసాద్ చౌరాసియానే అని ఎర్రబెల్లి తెలియజేశారు.
బాలమిత్రుల కథ సినిమాలో ప్రజాదరణ పొందిన గున్నమామిడి కొమ్మ మీద అనే పాటకు వేణుగాన సహకారం అందించింది కూడా ఆయనే అని తెలిపారు. అందరి హృదయాలను దోచేసి, మంత్ర ముగ్ధులను చేసే వేణు గానం చౌరాసియా సొంతమని కొనియాడారు. చౌరాసియాను ఇలా కలవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
వారిని ఆహ్వానించిన రామచంద్ర మిషన్ చైర్మన్ దా జీ గారికి, మిషన్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ సలహాదారు శోభ, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దంపతులు, ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, రోనాల్డ్ రాస్ తదితరులు కూడా హాజరయ్యారు.