Meta | ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృతసంస్థ మెటా అక్టోబర్ నుంచి యూరోపియన్ యూనియన్ (EU)లో అన్ని రాజకీయ ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల ప్రచారాలలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో కొత్తగా అమలు చేయనున్న ఈయూ నియమాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ ప్రారంభం నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో రాజకీయ, ఎన్నికల, సామాజిక సమస్యలకు సంబంధించిన ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు మెటా తన బ్లాక్ పోస్ట్‌లో తెలిపింది. ఈయూ రూల్స్ భారీ చట్టపరమైన అనిశ్చితులు, ఆపరేషనల్ సవాళ్లను ఉంటాయని మెటా పేర్కొంది.
ఈ నియమాలు తమ ప్రక్రియ, వ్యవస్థలపై చాలా అదనపు బాధ్యతలను విధిస్తున్నాయని, ఇది ప్రకటనదారులు, ప్లాట్‌ఫారమ్‌లు ఈయూలో పనిచేయడం చట్టబద్ధంగా చాలా క్లిష్టంగా మారుతుందని కంపెనీ పేర్కొంది. ఇంతకు ముందు గూగుల్ కూడా ఇదే చర్య తీసుకుంది. ఈయూలో రాజకీయ ప్రకటనలు ఆపివేస్తామని గూగుల్ గత సంవత్సరం ప్రకటించింది. ఈయూలో కొత్త రూల్స్ అక్టోబర్ పది నుంచి అమలులోకి వస్తాయి. రాజకీయ ప్రకటనలపై లేబుల్స్‌ను ఉంచడం తప్పనిసరి. ప్రకటనను ఎవరు ఉంచారో.. అది ఏ ప్రచారం.. ప్రక్రియకు సంబంధించిందో పేర్కొనాలి. అన్ని ప్రకటనలను డేటాబేస్‌లో నిల్వ చేయాల్సి ఉంటుంది. టార్గెట్ ప్రకటనలకు కఠినమైన రూల్స్ వర్తిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కంపెనీల వార్షిక ఆదాయంలో 6శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.