కొండాపూర్ : తీవ్ర నిమోనియాతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వ్యక్తికి హైటెక్స్ సిటీ మెడికవర్ హాస్పిటల్ ( Medicover Hospital) వైద్యులు ఎక్మో (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) ద్వారా పునర్జన్మను అందించారు. చికిత్సకు సంబంధించిన వివరాలను బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్యులు వెల్లడించారు.
40 ఏండ్ల వ్యక్తికి సాధారణ జ్వరం, దగ్గుతో మొదలైన సమస్య తీవ్ర న్యుమోనియా (Pneumonia) గా మారింది. ఊపిరితిత్తులు పూర్తిగా పని చేయడం మానేయగా, వెంటిలేటర్‌పై ఉన్న స్థితిలో హాస్పిటల్చేరిన రోగిని పూర్తిగా పరీక్షించిన అనంతరం అతనికి ఎక్మోను (ECMO) ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని వివరించారు. దీని ద్వారా గుండె, ఊపిరితిత్తుల పని తీరు మెరుగుచేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఎక్మో కొనసాగుతున్న సమయంలోనే బ్యాక్టీరియాను గుర్తించడానికి బ్రాంకోస్కోపి నిర్వహించి ఎప్పటికప్పుడు యాంటీబయాటిక్స్‌ను అందించామని వెల్లడించారు. కొద్దిరోజుల్లోనే రోగి కోలుకోవడంతో ఎక్మో , వెంటిలేటర్లను తొలగించామని చెప్పారు. ప్రస్తుతం రోగి కోలుకోవడంతో పాటు తనంతట తాను ఊపిరితీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఘనశ్యాం, ఏ రఘుకాంత్, తదితరులు పాల్గొన్నారు.