హైదరాబాద్: మెదక్ ప్రభుత్వాస్పత్రిలో ( Medak Govt Hospital ) ఇవాళ వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. గర్భిణి తరఫు బంధువులు తమ నర్సులు, ఇతర సిబ్బందిపై అనవసరంగా దాడి చేశారని, అందుకు నిరసనగా తాము విధులు బహిష్కరిస్తున్నామని తెలిపారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పంతులపల్లి గ్రామానికి చెందిన గర్భిణి వైద్యం కోసం బుధవారం మెదక్ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అదే రాత్రి కాన్పు చేస్తుండగా గర్భంలోనే శిశువు మరణించింది.
దాంతో గర్భిణి తరఫు బంధువులు ఆగ్రహానికి లోనయ్యారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని మండిపడ్డారు. ఆస్పత్రిలో నర్సులు, ఇతర సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి నిరసనగా ఇవాళ వైద్యులు, ఇతర సిబ్బంది విధులను బహిష్కరించారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, మెదక్ ప్రభుత్వాస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.