హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్త్రీనిధి సహకార సంస్థలో ఏకఛత్రాధిపత్యం రాజ్యమేలుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా స్వయం సహాయ సంఘాలకు రుణాలు ఇచ్చి, ఉపాధి కల్పించాల్సిన సంస్థలో.. ఎండీ విద్యాసాగర్‌రెడ్డి అరాచకంగా వ్యవహారాలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థలో పదవీకాలం ముగిసినా ఎండీగా తిష్టవేసిన ఈయన వ్యవహారశైలిపై ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పదవీకాలం ముగిసినా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక పొడిగింపు తెచ్చుకొని కొనసాగుతున్నారని మండిపడుతున్నారు. తన అనుయాయులను అందలం ఎక్కించడం, ఇష్టంలేని ఉద్యోగులను వేధించడం, రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడం, సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం వంటి వింత చర్యలతో సంస్థను భ్రష్టుపట్టిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ కమిషన్‌లో ఫిర్యాదు
స్త్రీనిధి సంస్థలో ఎండీ ధోరణితో అవినీతి, అరాచకాలు రాజ్యమేలుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. మహిళల సాధికారత కోసం ఏర్పాటైన స్త్రీనిధి సంస్థలో మహిళా ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్‌లో కూడా ఫిర్యాదు నమోదైంది. ప్రభుత్వం ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
విచారణ నివేదిక ఏమైనట్టు?
ఆర్థికశాఖ నిబంధనల ప్రకారం ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో రూ.328 కోట్ల టర్నోవర్ దాటితే ఆ సంస్థ వ్యవహారాలను ఐఏఎస్ స్థాయి అధికారి చూడాల్సి ఉంటుంది. కానీ రూ.5,400 కోట్ల టర్నోవర్ ఉన్న స్త్రీనిధి సంస్థకు ఎండీగా ఐఏఎస్ అధికారిని కేటాయించకుండా రిటైర్డ్ అధికారిని కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి.. సంస్థ నిధులతోపాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని పలువురు ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. నిరుడు సెప్టెంబర్ 13న నలుగురు ఉన్నతాధికారులతో విచారణ కమిటీ నియమించింది. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఆదేశించారు. కానీ, ఆ విచారణ ఏమైందో తెలియదని ఉద్యోగులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
ఆరోపణలు కోకొల్లలు
స్త్రీనిధి ఎండీ హోదాలో విద్యాసాగర్‌రెడ్డి అలవెన్సులతో కలిపి నెలకు రూ.3 లక్షలకుపైనే వేతనం పొందుతున్నారని తెలుస్తున్నది. ఇది నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగులు చెప్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) విషయంలో ఎండీ మోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విద్యాసాగర్‌రెడ్డి భార్య కూడా హెచ్ఆర్ఏ పొందుతున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే వడ్డీలేని రుణాలు, గ్రామ సంఘాలకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో, స్త్రీనిధి బ్యాలెన్స్ షీట్లలో తేడాలు, సీఎస్ఆర్ నిధుల మళ్లింపు వంటి వ్యవహారాల్లో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణల విషయంపై విద్యాసాగర్‌రెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా, తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని ఆయన ఖండించారు.