రాయపర్తి, నవంబర్ 19: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్ర శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో సోమవారం రాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అధునాతన గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్లతో చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం బ్యాంకు మేనేజర్ మాడిశెట్టి సత్యనారాయణ విధులకు హాజరుకాగా బ్యాంకులో దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్‌రావు, రాయపర్తి, వర్ధన్నపేట ఎస్సైలు కొంగ శ్రవణ్‌కుమార్, మెరుగు రాజు తమ సిబ్బందితో పాటు క్లూస్ టీంతో చేరుకుని విచారణ ప్రారంభించారు.