హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): నకిలీ క్యాన్సర్ ఔషధాల తయారీ రాకెట్‌ను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు ఛేదించారు. రూ.4.35 కోట్ల విలువైన నకిలీ ఔషధాలను సీజ్ చేశారు. ‘ఆస్ట్రిక హెల్త్ కేర్’ అనే సంస్థ క్యాన్సర్ నివారణకు ఉపయోగించే ఔషధాలను నకిలీ, కల్తీవి తయారు చేసి మారెట్లో అమ్ముతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 2న విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహించినట్టు డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ఔషధాలకు సంబంధించిన ఇన్వాయిస్లపై అల్వాల్ చిరునామా ఉన్నదని, అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా తప్పుడు అడ్రస్‌గా తేలిందని తెలిపారు. అనంతరం ఈ నెల 4న ఒక బృందం ఐడీఏ చర్లపల్లి, నాచారం, మేడ్చల్‌లోని వివిధ కొరియర్ కార్యాలయాలకు వెళ్లి తనిఖీలు చేపట్టగా, మరో బృందం కీసరలోని ఆస్ట్రిక హెల్త్ కేర్ సంస్థలో తనిఖీలు నిర్వహించినట్టు వెల్లడించారు. కంపెనీ నుంచి నకిలీ ఔషధాలను తీసుకెళ్తున్న కొరియర్ బాయ్‌ని గుర్తించడంతో మచ్చబొల్లారంలోని మూడు షట్టర్లలో నిల్వ చేసిన నకిలీ మందులు బయటపడ్డాయని వివరించారు.
రెండేండ్ల కిందటే లైసెన్స్ రద్దు
ఆస్ట్రిక హెల్త్‌కేర్ కంపెనీ లైసెన్స్‌ను 2021 జూలైలోనే ప్రభుత్వం రద్దు చేసిందని డీసీఏ డైరెక్టర్ జనరల్ తెలిపారు. అయినా కంపెనీలో పెద్ద ఎత్తున ఔషధాలు తయారు చేసి అమ్ముతున్నారని పేర్కొన్నారు. తయారీ తేదీని 2023 మార్చిగా ముద్రించారని వెల్లడించారు. మందుల లేబుల్స్‌పై ఆస్ట్రా జెనెరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ముద్రించారని, అసలు అలాంటి కంపెనీయే లేదని చెప్పారు. మొత్తం 36 రకాల క్యాన్సర్ నివారణ ఔషధాలు, ఇతర మందులను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.4.35 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. కేసులో ప్రధాన సూత్రధారి ఆస్ట్రికా హెల్త్‌కేర్ డైరెక్టర్ కే సతీశ్‌రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని వెల్లడించారు. మొత్తం 9 కంపెనీల పేర్లతో నకిలీ ఔషధాలను తయారుచేసినట్టు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇదే అతిపెద్ద నకిలీ క్యాన్సర్ ఔషధాల రాకెట్ అని పేర్కొన్నారు. నకిలీ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీటివల్ల ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరింత క్షీణిస్తుందని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో అడిషనల్ డైరెక్టర్లు పీ రాము, వీ బాలనగంజన్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు జీ శ్రీకాంత్, కే అన్వేశ్, ఎం చంద్రశేఖర్, వీ అజయ్, ఎస్ వినయ్సుష్మీ, కే మురళీకృష్ణ, బీ ప్రవీణ్, ఎన్ రవికిరణ్‌రెడ్డి, ఏఎన్ క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ ఔషధాలపై ముద్రించిన కంపెనీల పేర్లు