దుండిగల్, జూలై 10: ఆన్లైన్ గేమ్‌లు ఆడి అప్పులపాలైన ఓ కేటుగాడు వాటిని తీర్చేందుకు పెండ్లి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓసారి పెండ్లి చేసుకొని విడాకులు తీసుకున్న ఆ మాయగాడు ఈసారి మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి మరో కుటుంబాన్ని బురిడీ కొట్టించాడు. ఈ కుతంత్రంలో అతని కుటుంబసభ్యులూ పాత్రధారులుగా ఉన్నారు.
బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా, ఎనుకూరు మండలం, రాజలింగాల గ్రామానికి చెందిన నల్లమోతు సందీప్‌కుమార్ (38), కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, మల్లంపేట్‌లో నివాసముంటున్నాడు. సందీప్‌కుమార్ రష్యాలో ఎంబీబీఎస్ చదివి గతంలోనే నీలిమ అనే మహిళను వివాహం చేసుకుని విడాకులు ఇచ్చాడు. ఆన్లైన్ గేమ్‌లు ఆడే అలవాటున్న సందీప్ భారీగా నష్టపోయాడు. దీనినుంచి బయటపడేందుకు కుటుంబ సభ్యుల సహకారం తో మళ్లీ పెండ్లికి సిద్ధమయ్యాడు. తాను ఎన్టీఆర్ హెల్త్యూనివర్సిటీ నుంచి రేడీయాలజిస్టు పూర్తి చేశానని, 2016లో ఐఏఎస్‌గా ఎంపికై కర్ణాటకలో పనిచేస్తున్నట్టు నకిలీ పత్రాలు సృష్టిం చి మ్యాట్రిమోనిలో పేరు నమో దు చేసుకున్నాడు.
ఈ వివరాలు నిజమని నమ్మిన ఏపీలోని కర్నూల్ జిల్లా, ఆదోని మండ లం, కుల్మాన్‌పేట గ్రామానికి చెందిన శ్రావణి అనే యువతి సందీప్‌కుమార్‌ను 2018లో పెండ్లి చేసుకుంది. కట్నం కింద అత్తింటివారు 8 ఎకరాల భూమిని రాసిచ్చారు. కొంతకాలం తర్వాత తన బ్యాంక్ లాకర్లో రూ.40 కోట్లు నగదు ఉందని, ఆదాయపు పన్ను చెల్లించనందున ఆ మొత్తం హోల్డ్‌లో ఉందని, అవి విడుదల కావటానికి రూ.2 కోట్లు కావాలని శ్రావణిని అడిగాడు. దీంతో ఆమె తెలిసిన వ్యక్తుల నుంచి రుణం తీసుకొని భర్త, అతని సోదరి మోతుకూరి లక్ష్మి సాహితీ(35), మామ విజయ్‌కుమార్ (70), అత్త మాలతి(59) అకౌంట్లలోకి బదిలీ చేసింది. పెండ్లి బంగారాన్ని కుదువబెట్టడంతో శ్రావణికి అనుమానమొచ్చి నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవలు కావడంతో శ్రావణి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అమెరికాలో ఉన్న సాహితి మినహా కుటుంబసభ్యులందరినీ అరెస్టుచేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.