హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నామమాత్రపు అధికారాలతో ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కార్యక్రమాలు చేయలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం గౌరవాధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి తదితరులు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రస్తుత నిబంధనలను మార్చడం ద్వారా మార్కెట్ కమిటీ చైర్మన్లకు అధికారాలు కల్పించడంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ వర్తింపచేయాలని వినతిపత్రం సమర్పించారు.
మార్క్‌ఫెడ్ ఉద్యోగులకు మెమోలు
మార్క్‌ఫెడ్‌లో సమయానికి ఆఫీసుకురాని 13మంది ఉద్యోగులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి మెమోలు జారీ చేశారు. ఇందులో ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా, మరో 10 మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నట్టుగా తెలిసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఉదయం కోఠి జాంబాగ్‌లోని మార్క్‌ఫెడ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా ఐదారుగురు మినహా.. ఇతరులు రాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.
సుంకాల ఎత్తివేత దారుణం
అమెరికా నుంచి పత్తి దిగుమతులపై సుంకాన్ని ఎత్తివేయడం దారుణమని, ఇది తెలంగాణ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పత్తి రైతులు ఆర్థికంగా నష్టపోతారని పేర్కొన్నారు.