Maoists | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సీనియర్ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్రమైన చర్యలు చేపట్టింది. అతని నేతృత్వంలో ఏర్పాటైన కొందరు గిరిజన కోవర్టుల వల్లనే కీలకమైన మావోయిస్టు నేతలను కోల్పోయినట్లు భావిస్తున్నది. అతడిని విప్లవోద్యమ ద్రోహిగా పేర్కొంటూ.. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు రహస్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అతని దగ్గర ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని అల్టిమేటం జారీ చేసింది. లేకుంటే వాటిని పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. ఈ నెల 17న పొలిట్ బ్యూరో సభ్యుడు సోను అభయ్ పేరుతో విడుదల చేసిన పత్రికా ప్రకటన పార్టీ నిర్ణయం కాదని స్పష్టం చేసింది. అది అతని వ్యక్తిగత అభిప్రాయమని తెలిపింది. కామ్రేడ్ సోను ఉద్దేశపూర్వకంగా ఈ సత్యాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పింది. ఈ ప్రకటన మోసపూరితమైనదని తెలిపింది.
ఆయుధాలు వదిలేసి, శత్రువుకు లొంగిపోవడం అంటే అమరవీరులకు దేశంలోని అణచివేయబడిన వర్గాలు, అణచివేయబడిన సామాజిక సంఘాలు, అణచివేయబడిన జాతులకు ద్రోహం చేయడమేనని దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ వికల్ప్ పేరుతో ఇటీవల విడుదల చేసిన లేఖలో పేర్కొన్నది. అతను ముమ్మాటికీ విప్లవ ద్రోహానికి పాల్పడుతున్నాడని అభిప్రాయపడింది. అందువల్ల, పార్టీ సభ్యులందరూ, అన్ని స్థాయిలలోని పార్టీ కమిటీలు, జైలులో ఉన్న పార్టీ సభ్యులు, విప్లవ శ్రేయోభిలాషులు అందరూ సోను ఇచ్చిన ప్రకటనను, ద్రోహాన్ని తీవ్రంగా ఖండించాలని కోరింది. సోను, అతని సహచరులు శత్రువుకు లొంగిపోవాలనుకుంటే అలా చేయొచ్చని తెలిపింది. అయితే ఆ ఆయుధాలను పార్టీకి అప్పగించాలని డిమాండ్ చేసింది. వాటిని సానుకూల రీతిలో అప్పగించకపోతే పీఎల్జీఏ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.