హైదరాబాద్, జూలై 14 (నమస్తే తె లంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి వ్యవహార శైలితో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, కార్యదర్శిని ప్రభుత్వం తక్షణం కట్టడి చేయాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్ డిమాండ్ చేశారు. గిరిజన గురుకు ల విద్యాసంస్థలో మిగిలిపోయిన సీట్లను త్వరగా భర్తీ చేయాలని, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం సత్వరం పరిష్కరించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, ఇతర గిరిజన సంఘాల నేతలతో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. గురుకుల సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి వ్యవహారశైలి వల్ల గిరిజన గురుకుల విద్యాసంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వివరించారు. మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసుకునేందుకు గిరిజన గురుకుల సంస్థకే అధికారాలు బదలాయించాలని డిమాండ్ చేశారు.
స్పెషలాఫీసర్ మాకొద్దు ; వికారాబాద్ జిల్లా మర్పల్లి కేజీబీవీ ఎదుట నిరసన
మర్పల్లి, జూలై 14 : ఈ స్పెషల్ ఆఫీసర్ తమకు వద్దంటూ వికారాబాద్ జిల్లా మర్పల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సోమవారం పాఠశాల గేటు ఎదుట బైఠాయించి ని నదించారు. ‘పురుగుల భోజనం మాకొద్దు.. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి’ అని విద్యార్థినులు శనివారం పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగడంతో కేజీబీవీ జేసీడీ శ్రీదేవి, అధికారులు పాండు, రంగనాథ్, మండల ప్రత్యేకాధికారి మోహన్‌రావు, ఎంపీడీవో రాజమల్లయ్య, తహసీల్దార్ పురుషోత్తం, ఎంఈవో అంజిలయ్య సో మవారం విద్యాలయాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ సమస్యలను వారితో చెప్పుకొన్నారు.వారు వెళ్లిపోగానే విద్యార్థినులు గేటు ఎదుట బైఠాయించి స్పెషల్ ఆఫీసర్ తమకు వద్దని నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు మళ్లీ విద్యాలయానికి చేరుకుని వారితో మాట్లాడారు. ‘మీరు వెళ్లిన తర్వాత మేడమ్ మాకు టార్చర్ పెడ్తది అని తెలిపారు. దీంతో విద్యార్థినులను సముదాయించి పంపించారు.