రవీంద్రభారతి,అక్టోబర్ 17: కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌రావు ఆగడాలతో తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఉద్యోగ్ అండ్ దళిత్ బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ జనరల్ సెక్రటరీ గరిమెళ్ల గోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కాప్రా మండలంలో 61.34 ఎకరాలలో ఉన్న తమ 706 ప్లాట్లను కబ్జాచేసి అందులోకి వెళ్లకుండా గూండాలతో కొట్టిస్తున్నాడని ఆరోపించారు. తాము కట్టుకున్న గోడలు, గదులను కూలగొట్టించారని తెలిపారు.
తమకు ప్లాట్లను అప్పగించకపోతే తామందరం ప్లాట్ల వద్దే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ప్రేమ్‌సాగర్‌రావు అరాచకాలు భరించలేక కొందరు ప్లాట్ల ఓనర్లు ఆత్మహత్య చేసుకొన్నారని, మరికొందరు చనిపోయారని పేర్కొన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్‌గాంధీ, ఖర్గేకు మెయిల్లో, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌కు వినపత్రం సమర్పించినా పట్టించుకోలేదని చెప్పారు. ప్లాట్ల ఓనర్లందరూ మంచిర్యాలలో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌రావును ఓడిస్తామని స్పష్టం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్, కేటీఆర్, రాష్ట్ర గవర్నర్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.