సూర్యాపేట, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి సభలోనూ సీఎం రేవంత్‌రెడ్డి తీరు మారలేదు. అవే తిట్ల పురాణం, ప్రతిపక్షంపై శాపనార్థాలు, బండ బూతులు వల్లెవేశారు. ఇదంతా వినలేక పదిహేను నిమిషాల్లోనే జనం వెనుదిరిగి వెళ్లడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి 50 నిమిషాలు ప్రసంగిస్తే కేవలం 7 నిమిషాలు మాత్రమే వెయ్యి రోజుల పాలనపై జరిగిన అభివృద్ధి, సంక్షేమాలపై ప్రసంగించారు.
మిగతా 43 నిమిషాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మొదలు కొని కేటీఆర్, హరీశ్‌రావులతో పాటు బీఆర్ఎస్పై విషం కక్కారు. కానీ సీఎం ప్రసంగంపై జనం నుంచి స్పందన కరువైంది. జనం వెనుదిరిగినా ఖాళీ సీట్లకే సీఎం ప్రసంగించారు. కొద్ది మంది నాయకులను కిందకు పంపి జనాన్ని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తనకు చదువు లేదేమో కానీ సంస్కారం ఉందంటూనే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఎనిమిది సభల్లో పాల్గొనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నకిరేకల్ సభకు హాజరయ్యారు. మంత్రి పదవిపై ఆశతోనో లేక సురేఖను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినందుకో తెలియదు కానీ ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారు. గతంలో నల్లగొండ, దేవరకొండ, హుజూర్నగర్, మిర్యాలగూడ, తిరుమలగిరిలతో పాటు భువనగిరిలో రెండు సార్లు, ఆలేరులో ఒకసారి సభలు జరుగగా నకిరేకల్ సభ తొమ్మిదోది. కాగా వేదికపై సీఎం పక్కన సీటు ఖాళీ అయిన ప్రతిసారి అందులోకి రాజగోపాల్‌రెడ్డి దూరి ముచ్చటించడం కనిపించింది. ఇదిలా ఉంటే మునుగోడు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనాన్ని చౌటుప్పల్ మీదుగా నకిరేకల్ వరకు భారీ ర్యాలీతో తీసుకురావడం బలనిరూపణకేనని చర్చ జరిగింది.