కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ)/కౌటాల/వెల్గటూర్/చెన్నూర్ రూరల్: పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంపై రైతులు భగ్గుమన్నారు. మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా పత్తి కొనుగోలు చేయడం లేదంటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట స్థానిక రైతులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయని, రోజుల తరబడి ఎదురు చూడటం వల్ల వాహనాల చార్జీల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సీసీఐ స్పందించి ఎప్పటికప్పుడు కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పత్తిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
కొత్తపేటలో ధర్నా..
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేటలో రాష్ట్ర రహదారిపై పత్తి రైతులు ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ ఎండపల్లి మండలం కొత్తపేటలో శాతవాహన జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రంలో రోజుకో కారణం చెప్పి పత్తి కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. రెండ్రోజుల కిందట ఆన్లైన్లో ఆధార్‌తో రైతు సాగు చేసిన పంటల వివరాలు సరిపోవడం లేదని నిలిపివేశారని, మంగళవారం సిగ్నల్ కూడా రావడం లేదని కొనుగోలు చేయలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ధర్నాతో ఇరువైపులా కిలో మీటర్ పొడవున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు.
కిష్టంపేటలో రహదారిపై ధర్నా..
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామ సమీపంలోని వరలక్ష్మి జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. వీరి ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. మూడు రోజులుగా పత్తి వాహనాలతో ఇక్కడే ఉండాల్సి వస్తున్నదని, ఆన్లైన్ పని చేయడం లేదంటూ సీసీఐ అధికారులు నిర్లక్ష్యపు సమాధానమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. మాజీ ఎంపీపీ మంత్రి బాపు మాట్లాడుతూ.. దళారులు-సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నిత్యం రోడ్డెక్కాల్సి వస్తున్నదని, ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి రెండు గంటల పాటు ధర్నా చేయడంతో రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మార్కెట్ సెక్రటరీ రామాంజనేయులు, పట్టణ సీఐ రవీందర్, ఎస్సై సుబ్బారావు, సీపీవో అక్కడికి చేరుకొని ఆన్లైన్ రాగానే పత్తి కొనుగోళ్లు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కౌటాలలో రెండు కిలోమీటర్ల మేర జామ్
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని శ్రీ వైష్ణవీ మాత కాటన్ ఇండస్ట్రీస్‌లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర పత్తి వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు, డ్రైవర్ల కిరాయి భారం పడుతుందని, వెంటనే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా, కొందరు గత్యంతరం లేక ఎంతో కొంతకు ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని అమ్ముకొని వెనుదిరుగుతున్నారు.