Nalgonda | నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లా అత్యధిక స్థానాలు కట్టబెడుతున్నది. ఈసారి కూడా మొత్తం 12 స్థానాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. తమను గెలిపిస్తే సీఎం అవుతామని సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. వీరికి జానారెడ్డి కూడా తోడయ్యారు. వీరికి చివరకు నిరాశే మిగిలింది.
జిల్లాకు చెందిన కే జానారెడ్డి, పీసీసీ మా జీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకనేతలుగా గుర్తింపు పొందారు. ప్రస్తుత ఎన్నికల్లో జానారెడ్డి పోటీచేయలేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఆరోసారి, వెంకట్‌రెడ్డి ఐదోసారి గెలుపొందారు. ఈసారి గెలిపిస్తే తమకు సీఎం అయ్యే చాన్స్ ఉన్నదని ఎన్నికల ప్రచారంలో వీరిద్దరూ అనేకసార్లు చెప్పుకున్నారు. దీంతో క్యాడర్ కూడా మరింత ఉత్సాహంతో పనిచేసింది. జానారెడ్డి కూడా ఒక సందర్భంలో తనకు కూడా సీఎం అయ్యే అవకాశం లేకపోలేదని చెప్పారు.
పదవులు తననే వెతుక్కుంటూ వస్తాయని, అలాంటి సందర్భమే వస్తే నాగార్జునసాగర్ నుంచి బరిలో ఉన్న తన కుమారుడు జయవీర్‌రెడ్డి రాజీనామా చేస్తారని, తాను పోటీ చేసి సీఎం అవుతాంటూ కలల దృశ్యాన్ని ఆవిష్కరించారు. వీరితోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తనను గెలిపిస్తే కీలక స్థానంలో ఉంటానని ప్రచారం చేసుకున్నారు. కానీ వీరెవ్వరూ సీఎం రేసులో నిలబడలేకపోయారు.
ముఖ్యమంత్రి పదవి కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకు సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ అధిష్ఠానం వద్ద వాదించారు. తనతో పోలిస్తే రేవంత్‌రెడ్డికి పాలనాపరమైన అనుభవం లేదని, తొందరపాటు వ్యాఖ్యలతో నష్టం జరుగుతుందని వివరించారు. మల్లు భట్టి విక్రమార్కతో కలిసి చివరి వరకు ప్రయత్నం చేసినా అధిష్ఠానం రేవంత్‌రెడ్డి వైపే మొగ్గుచూపింది.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా సోనియాగాంధీ ఆశీస్సులతో ఎప్పుడో ఓ సారి తాను కూడా సీఎం అవుతానని చాలాసార్లు చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు, రంగారెడ్డి జిల్లా నుంచి మర్రి చెన్నారెడ్డి, ఖమ్మం నుంచి జలగం వెంగళరావుకు సీఎం అయ్యే చాన్స్ దక్కిందని ఈసారి నల్లగొండ నుంచి సీఎం కావడం ఖాయమని చెప్పుకున్నారు. కానీ, ఫలితాల అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేస్‌లో లేకుండాపోయారు. రేవంత్‌రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డాడని, ఆయనే సీఎం పదవికి అర్హుడని వ్యాఖ్యానించడంతో కోమటిరెడ్డి చేతులెత్తేసినట్టయ్యింది. ఇక జానారెడ్డి గురించి ప్రస్తావించిన వారే లేకుండా పోయారు. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సీఎం పోస్టు మరోసారి కలగానే మిగిలింది.