నోటికాడి పంటను ఎత్తగొట్టిండ్రు..
‘సారు.. నిరుడు, పోయినేడు పంట పొట్టకొచ్చిన తర్వాత కూడా పుష్కలంగా నీళ్లు ఉండేవి. పంట కోతలు మొదలుపెడ్తాం. నీళ్లు ఆపమని మేము అధికారులను అడిగేవాళ్లం.
- ఒకతడికైనా నీళ్లిస్తే పంటలు బతికేవి
- పెట్టుబడి కూడా పూర్తిగా నష్టపోయాం
- పంటను కాపాడుడు మా వల్ల కాలేదు
- కేసీఆర్‌కు మొగ్దూంపూర్ రైతుల మొర
- సర్కారుపై పిడికిలి బిగించి కొట్లాడుదాం
- ఎన్నికలయ్యాక మేడిగడ్డ నీళ్లు మలుపు కొనేందుకు పోరాటం చేద్దాం: కేసీఆర్
(కరీంనగర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): ‘సారు.. నిరుడు, పోయినేడు పంట పొట్టకొచ్చిన తర్వాత కూడా పుష్కలంగా నీళ్లు ఉండేవి. పంట కోతలు మొదలుపెడ్తాం. నీళ్లు ఆపమని మేము అధికారులను అడిగేవాళ్లం. గుండివాగు, ఇరుకుల్ల వాగుల నీళ్లు ఆపిన తర్వాతే మేము పంటలు కోసుకునేవాళ్లం. ఇప్పుడేమో నీళ్లియ్యండి సారూ.. అని అధికారులను వేడుకుంటున్నా ఒకళ్లు మాట్లాడుతలేరు. పంట పాలుపడే టైంలోనే నీళ్లు లేవు. పంట మొత్తం ఎండి పోయింది. ఎకరానికి రూ.20-30 వేలు పెట్టుబడి పెట్టినం. మా కష్టం, కైకిలి పోయినా పర్వాలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి అయినా మాకు వచ్చేతట్టు చూడుండ్రి సారూ..’ అంటూ కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్దూంపూర్, బోయినపల్లి గ్రామాల రైతులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మొరపెట్టుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణలోపం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు కేసీఆర్ పొలంబాట పట్టారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల రైతులను కలిశారు. పొలాల వద్దకే వెళ్లి రైతులను ఓదార్చారు. వారి కష్టాలను విన్నారు. నెర్రలుబారిన పంటపొలాలను చూసి చలించిపోయారు. పేరుపేరున రైతులను పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు తమ బాధలు చెప్పుకొని ప్రభుత్వం చేత నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు.
నీళ్లు కావాల్సినప్పుడు అందలేవు…
‘అష్టకష్టాలు పడి వరి పంట వేసినం. పాలుపడే సమయంలో ఇంకో 1-2 తడులకు నీళ్లు కావాల్సి ఉండె. ఇంకొక తడికి నీళ్లు ఇచ్చినా పంటలను దకించుకునేవాళ్లం. మా నోటికాడి పంటను ఎత్తకొట్టిండ్రు. కాలువల్లో నీళ్లు లేకపోవడంతో బావుల నుంచి నీళ్లు తెచ్చుకొనేందుకు పైప్‌లైన్ వేశాం. కానీ, బావుల్లో కూడా నీళ్లు లేవు. గడిచిన పదేండ్లలో ఇంతటి దారుణం ఎప్పుడూ చూడలే. మా పొలాలకు ఎస్సారెస్పీ డీ-89 కాలువ ద్వారా నీళ్లు వచ్చేవి. కానీ, ఈసారి ఇవ్వలేదు. అధికారులను అడిగితే సమాధానం లేదు. మీరే మాకు న్యాయం చేయాలి.. సారూ..’ అంటూ మగ్దూంపూర్కు చెందిన రైతులు పొలగాని సంపత్, బండి సంపత్ కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు.
ఈ దుస్థితిని రైతులు ఊహించలే..
‘మా గ్రామం నుంచి ప్రతి సీజన్లో 18 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈసారి ఆరువేల క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేలా కనిపించడంలేదు. పంట వేసే సమయంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని రైతులు ఊహించలేదు సారూ’ అని మొగ్దూంపూర్ గ్రామ మాజీ సర్పంచి జక నర్సయ్య కేసీఆర్‌కు వివరించారు.
నీళ్లు లేక పొలాలు నెర్రెలు వారాయి..
మా గ్రామంలో పంటలను చూస్తే పైకి బాగానే కనిపిస్తాయి. కానీ, పొలం లోపల చూస్తే అసలు విషయం తెలుస్తది. పచ్చని పైరుతో ఉన్న పొలాలు నీళ్లు లేక నెర్రెలు వారాయి. వరి కంకులుపైకి కనిపిస్తున్నప్పటికీ నీళ్లు సరిగ్గా అందక తాలుగా మారుతున్నాయి. బస్తాల్లో మిల్లులకు తీసుకుపోతే మిల్లర్లు తాలు వచ్చిందని వీటిని తీసుకోరు. వీటిని కోసి ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్తే రూపాయి కూడా రాదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మీరు మమ్మల్ని ఆదుకోవాలి సారూ..’ అని రైతు గాండ్ల లక్ష్మీనారాయణ కేసీఆర్‌కు మొరపెట్టుకున్నారు.
పదెకరాల పంట ఎండిపోయింది
బోయినపల్లి వద్ద పదెకరాల భూమిని కౌలుకు సాగుచేస్తున్న. కిష్టమ్మ చెరువు ఒర్రె నుంచి నీళ్లు తీసుకొని పంట పండిస్తున్న. ఇన్నేండ్లలో ఏనాడూ కనీసం ఒక గుంట భూమి కూడా నీళ్ల లేక ఎండిపోలేదు. కానీ, ఈసారి మొత్తం పంట ఎండిపోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. భారీగా నష్టపోయిన ఆదుకునే మార్గం మీరే చూడాలి సారూ..’ అని మిడ్ మానేరులో భూములు కోల్పోయిన చీర్లవంచకు చెందిన రైతు గంగు రమేశ్ కేసీఆర్‌కు మొరపెట్టుకున్నాడు.
మోటార్లు కాలిపోయాయి
‘మల్లాపూర్‌లో మాకున్న పదెకరాల పొలం సాగుచేయగా, నీళ్లు లేక నాలుగు ఎకరాలు ఎండిపోయింది. కరెంటు ఓల్టేజ్‌లో హెచ్చుతగ్గుల వల్ల మోటార్లు కాలిపోయాయి. అనేకసార్లు రిపేర్లు చేయించాం. అయినా ఉపయోగం లేదు. కరెంటు సమస్యతోనే నాలుగు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది’ అని రైతు సోదరులు చల్లా వెంకట్ రెడ్డి, చల్లా లక్ష్మిరెడ్డి వాపోయారు.
అడుగడుగునా వరికంకులతో రైతులు…
కేసీఆర్ కరీంనగర్‌కు బయల్దేరింది మొదలు పార్టీ శ్రేణులు ఆయన వెంటే నడిచాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, బాల్క సుమన్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేశ్, పార్టీ నేతలు జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, కొండూరి రవీందర్రావు, తుల ఉమ, దావ వసంత, చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు కేసీఆర్ కాన్వాయ్‌తో కరీంనగర్ చేరుకున్నారు.
మార్గమధ్యంలో ప్రజలు పెద్దఎత్తున కేసీఆర్‌కు సంఘీభావం తెలుపుతూ రోడ్లపైకి వచ్చారు. మొగ్దూంపూర్ నుంచి బోయినపల్లికి వెళ్తుండగా మార్గమధ్యంలో రామడుగు మండలంలో, గంగధర మండలంలో రైతులు రోడ్లపైకి వచ్చి సంఘీభావం కేసీఆర్ తెలిపారు. వెదిర వద్ద రైతులంతా వరి కంకులు పట్టుకొని కేసీఆర్‌కు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. కాన్వాయ్ ఆపి మరీ కేసీఆర్ రైతుల కష్టాలను విన్నారు. రైతులు ఇచ్చిన వరి కంకులను తీసుకున్నారు.
పార్టీలో జోష్.. రైతుల్లో భరోసా
కరీంనగర్ అంటేనే బీఆర్ఎస్కు కంచుకోట. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత జిల్లాకు కేసీఆర్ రావడం ఇదే తొలిసారి. దీంతో కార్యకర్తలు పెద్దఎత్తున కదిలివచ్చారు. కేసీఆర్ జిల్లాలో ఉన్నంత సేపు నాయకులు, కార్యకర్తలు ఆయనతోనే ఉన్నారు. అడుగడుగునా కేసీఆర్ జై.. అంటూ నినాదాలు ఇచ్చారు. రైతులు ప్ల కార్డులు పట్టుకొని తమ పంట పొలాలు ఎలా ఎండిపోయాయో చూపించారు. కేసీఆర్‌కు కనిపించేలా ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులు చేతులు ఎత్తి దండం పెడుతూ సమస్యలను పరిషరించాలని వేడుకోవడం కనిపించింది. కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. కేసీఆర్ పర్యటన ఇటు పార్టీ క్యాడర్లో జోష్ నింపగా.. రైతులకు భరోసాను ఇచ్చింది.
కేసీఆర్ కరీంనగర్ పర్యటన సాగిందిలా..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ మండలం మొగ్దూంపూర్కు చేరుకున్నారు. గ్రామ రైతుల బాధలు విన్నారు. ఎండిన పంటలను పరిశీలించారు. అనంతరం కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసానికి చేరుకొని, భోజనం చేశారు. గంగాధర మీదుగా బోయినపల్లికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.42 గంటలకు ఎండిన పంట పొలం వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. మధ్యాహ్నం 3.56 గంటలకు వరకు శ్రీరాజరాజేశ్వర జలాశయం శాభాష్‌పల్లి వంతెన వద్దకు చేరుకున్నారు. అకడి నుంచి జలాలను పరిశీలించారు. బస్సు దిగి కారులో సిరిసిల్లకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7.03 గంటల వరకు మీడియాతో మాట్లాడారు.
పోరాడుదాం.. అండగా నేనుంటా
‘ఈ సరారుకు రైతులంటే పట్టింపులేదు. పీఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి రైతులను ఆదుకోవడంపై లేదు. రాష్ట్రంలో నాలుగు నెలల్లోనే పాలన అస్తవ్యస్తంగా మారింది. రైతులు రోడ్డు మీదపడ్డారు. బ్రహ్మండమైన సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు ఉన్నా ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోతున్నది. నీటి నిర్వహణలో ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మీ (రైతుల) తరఫున నేను పోరాడుతా.. మీకు అండగా ఉంట. నీళ్లు ఎట్లా రావో చూద్దాం’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. ‘మీ కష్టసుఖాల్లో నేనుంటా.. మీ అందరిని ప్రభుత్వం ఆదుకునేవరకు పోరాటం చేస్తా’ అని భరోసా ఇచ్చారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. మొగ్దూంపూర్, బోయినపల్లి, వెదిర తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. వ్యవసాయ పొలాల్లోనే రైతులతో మాట్లాడారు. నెర్రలుబారిన నేలను తడిమి చూశారు. రైతన్నల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఉదయం ప్రారంభమైన కేసీఆర్ పొలంబాట సాయంత్రం వరకు సాగింది.
రైతులే యుద్ధానికి సిద్ధం కావాలి
లోక్‌సభ ఎన్నికలు అయిన వెంటనే మేడిగడ్డ నీళ్లను మనమే పోరాటం చేసి సాధించుకుందామని మొగ్దూంపూర్ రైతులతో కేసీఆర్ చెప్పారు. పచ్చని పంట పొలాలతో ఉండే కరీంనగర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతున్నదని, రైతుల ప్రాణాలు తీసేందుకే ఇలా చేస్తున్నదని ఆరోపించారు. కాళేశ్వరం జలాలను తమ పంట పొలాలకు మళ్లించుకునేందుకు రైతులే యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత సమగ్ర కార్యాచరణ ప్రకటిస్తానని, ఈ దిశగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పంట ఎండిపోయినందుకు పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఎండిన ప్రతి ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని, పెట్టుబడి ఖర్చులను భరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు కొట్లాడుదామని భరోసా ఇచ్చారు. రైతులు ఎట్టిపరిస్థితుల్లోను ధైర్యం కోల్పోవద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

