హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : భూ రికార్డుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రముఖ వ్యవసాయ విశ్లేషకుడు దొంతి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే భూ రికార్డులను గ్రామస్థాయిలో అం దుబాటులో ఉంచాలని, రైతులు స్వయంగా చూసుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, తెలంగాణ రాష్ట్ర కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధుంభవన్‌లో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యవసాయ విశ్లేషకుడు దొంతి నరసింహారెడ్డి, హైకోర్టు న్యాయవాది మహ్మద్ సాదిక్ అలీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ..1998లోనే ప్రపంచ బ్యాంకు విధానాల ప్రకారం భూమిని వినిమయ వస్తువుగా మారెట్లో చలామణి చేయడానికి వీలుగా భూ రికార్డులను డిజిటలైజేషన్(కంప్యూటర్లో ఎక్కించడం) చేశారని పేర్కొన్నారు. భూ రికార్డులను డిజిటలైజేషన్ సమయంలోనే అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. భూ రికార్డుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహమ్మద్ సాదిక్ అలీ మాట్లాడుతూ.. 22 ఏతోపాటు భూభారతిపై, కౌలు రైతుల చట్టం అమలుపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. 22ఏ లో గతంలో 80 లక్షల ఎకరాలు నిషేధ భూమిగా ఉంటే.. నేటి ప్రభు త్వం 14 లక్షలు ఎకరాల భూమిని చేర్చిందని పేర్కొన్నారు. 22ఏ నిషేధ భూముల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2011 కౌలు రైతుల చట్టాన్ని అమలు చేయాలని, కౌలు రైతుల గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర కౌలు రైతు సంఘం విసృ్తత కౌన్సిల్ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని రాజబహదూర్‌గౌర్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కౌలు రైతు సంఘం నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జాలాది రవి, అధ్యక్షుడిగా జకుల రామారావు, ప్రధాన కార్యదర్శిగా కొప్పోజు సూర్యనారాయణ, కోశాధికారిగా ఏ శ్రీనివాస్‌రెడ్డిని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పీ రామకృష్ణారెడ్డి, వాడే లక్ష్మి, బండమీది వెంకన్న, బొల్లు ప్రసాద్, మహ్మద్ పాషా, సహాయ కార్యదర్శులుగా అన్నెం పాపిరెడ్డి, సుభాన్రెడ్డితోపాటు 21 మంది సభ్యులు ఎన్నుకున్నారు.