CM Revanth Reddy | నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఫోర్త్ సిటినీ ఫ్యూచర్ సిటీగా 50వేల ఎకరాల్లో నిర్మించే బాధ్యత తనదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. ఏదైనా కట్టాలంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి కోల్పోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. శనివారం నల్లగొండ జిల్లా బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పైలాన్‌ను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో రెండో యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి, నల్లగొండ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజీవ్ మైదాన్‌లో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్లగొండ ప్రజలు బతకలేరు. మూసీలో గోదావరి జలాలను ప్రవహింపజేసి, ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తాం అన్నారు. సంక్రాంతి తర్వాత రైతుభరోసా డబ్బులు జమ చేస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రాజెక్టునే మరోసారి
శనివారం నల్లగొండ పర్యటనలో రేవంత్‌రెడ్డి ప్రారంభించిన అభివృద్ధి పనులు ఏవీ కూడా కాంగ్రెస్ ఏడాది పాలనలో చేపట్టినవి కావు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పూర్తయిందంటూ పైలాన్‌ను ఆవిష్కరించారు. రెండు మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్న నీటికి హారతి ఇచ్చారు. కానీ ఈ ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో 2007లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ మధ్యలోనే ఆగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి సీఎం కేసీఆర్ సర్కారు రూ.674.67 కోట్లతో అంచనాలు రూపొందించి, రూ.469 కోట్లు ఖర్చు పెట్టింది. సర్జ్‌పూల్, పంప్‌హౌజ్, అప్రోచ్ కెనాల్, సొరంగమార్గం లైనింగ్, విద్యుదీకరణ పనులు పూర్తిచేసింది. నిరుడు మే 6న ట్రయల్ రన్, మోటార్ల పరీక్ష నిర్వహించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు కోసం నిధులు ఇవ్వలేదు. పనుల్లోనూ పురోగతి లేదు. కొత్తగా ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదు. కానీ మరోసారి ట్రయల్న్ నిర్వహించమేంటని జనం విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ ఘనతపై మాట్లాడని రేవంత్
కేసీఆర్ కలల ప్రాజెక్టుగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు 85 శాతం వరకు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా ప్రణాళిక ప్రకారం జరిగాయి. పవర్ ప్లాంట్‌లోని రెండో యూనిట్ ద్వారా 800 మెగావాట్ల విద్యుదుత్పత్తిని రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నల్లగొండ మెడికల్ కాలేజీని కూడా కేసీఆర్ హయాంలోనే నిర్మించారు. నల్లగొండ పర్యటనలో రేవంత్‌రెడ్డి ఈ రెండింటి గురించి ఎక్కడా మాట్లాడలేదు. కేసీఆర్‌కు క్రెడిట్ దక్కుతుందన్న ధోరణితో రేవంత్ వాటి గురించి మాట్లాడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజగోపాల్‌రెడ్డి డుమ్మా
నల్లగొండ సభకు మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు. మంత్రిపదవి ఇవ్వలేదనే అసంతృప్తితోనే కాంగ్రెస్, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని జిల్లాలో చర్చ జరుగుతున్నది. స్వగ్రామం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు వరకు వెళ్లిన రాజ్‌గోపాల్‌రెడ్డి నల్లగొండ కార్యక్రమాల్లో పాల్గొనకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. బ్రాహ్మణవెల్లంలలో రాజ్‌గోపాల్‌రెడ్డిని గమనించిన ఆయన సోదరుడు వెంకటరెడ్డి.. ‘10 నెలల నుంచి దూరంగా ఉంటున్నవు. ఎక్కడా కనిపిస్తలేవు. ఇటురా గోపాల్’ అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సీఎం రేవంత్ సభ వెలవెల
నల్లగొండలో సీఎం రేవంత్‌రెడ్డి సభ జనం లేక వెలవెలబోయింది. సీఎం సభా ప్రాంగణానికి చేరుకునే సమయానికే జనం తిరుగుముఖం పట్టారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోయారు. ఆ తర్వాత క్రమంలో ఉత్తమ్, భట్టి మాట్లాడారు. అప్పటికి సభ మరింత ఖాళీ అయింది. ఇక దామోదర మాట్లాడేందుకు నిరాకరించారు. చివరిగా రేవంత్ ప్రసంగించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగానే జనం సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.