సంగారెడ్డి, డిసెంబర్ 19 (నమస్తేతెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో ఉన్న లగచర్ల రైతులు శుక్రవారం విడుదల కానున్నారు. నాంపల్లి స్పెషల్ కోర్టు రెండురోజుల క్రితం లగచర్ల రైతులకు బెయిల్ మంజూరు చేసింది. గురువారం సాయంత్రం వరకు బెయిల్‌కు సంబంధించిన పత్రా లు సిద్ధం కాలేదు.
సాయంత్రం 6 గంటల తర్వాత బెయిల్ పత్రాలను లగచర్ల రైతుల తరపున న్యాయపోరాటం చేసిన బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు రాంచందర్‌రావు, శుభప్రద్ పటేల్ కంది జైలు అధికారులకు అందజేశారు. బెయిల్ పత్రాలు అందినప్పటికీ నిబంధనల ప్రకారం సాయంత్రం 6 దాటిన తర్వాత ఖైదీలను విడుదల చేయరు. దీంతో శుక్రవారం ఉదయం రైతులు కంది జైలు నుంచి బయటకు రానున్నారు. జైలు నుంచి విడుదల కానున్న రైతులకు బీఆర్ఎస్ నాయకులు, గిరిజన సంఘాల వారు, కుటుంబ సభ్యులు శుక్రవారం ఘన స్వాగతం పలుకనున్నారు.