హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ఒక కాలేజీ విద్యార్థులు మరో కాలేజీ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు వినియోగించుకొనేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) వెసులుబాటు కల్పించింది. గతంలో ఇలాంటి అవకాశం లేదు. కానీ, ప్రస్తుతం వనరులను పరస్పరం వాడుకోవచ్చని యూజీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఆప్టిమల్ యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ బై హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్’ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవలికాలంలో సెంట్రల్ యూనివర్సిటీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో విద్యాప్రమాణాల పెంపునకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా, రిసెర్చ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రూసా.. ఇతర ప్రాజెక్టుల నిధులతో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ల్యాబ్‌లు, గ్రంథాలయాలను, రిసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక విద్యాసంస్థలో అందుబాటులో ఉన్న వనరులను వేరే విద్యాసంస్థకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు, రిసెర్చ్ స్కాలర్లు వాడవచ్చని యూజీసీ వెల్లడించింది.
మన దగ్గర క్లస్టర్ రూపంలో..
వనరుల పరస్పర వినియోగ విధానం ఇప్పటికే మన రాష్ట్రంలో అమల్లో ఉన్నది. క్లస్టర్ కాలేజీల రూపంలో డిగ్రీ స్థాయిలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో మూడు క్లస్టర్లుగా విభజించి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేశారు. ఈ విధానాన్ని ఇటీవలే మరికొన్ని డిగ్రీ కాలేజీలకు విస్తరించారు. వనరులు అధికంగా ఉన్న ఒక కాలేజీతో వనరులు తక్కువగా ఉన్న మరో రెండు కాలేజీలను అనుసంధానించారు. ఈ విధానం.. సత్ఫలితాలివ్వడమే కాకుండా వనరుల కొరత సమస్యను తీరుస్తున్నది.
వినియోగం ఇలా..
వనరుల వినియోగంపై రెండు విద్యాసంస్థలు పరస్పరం అంగీకారానికి రావాలి. నిర్దిష్ట కాలపరిమితితో ఎంవోయూను కుదుర్చుకోవాలి.
ఒక విద్యాసంస్థలోకి మరో విద్యాసంస్థ నుంచి వచ్చే విద్యార్థులకు ఐడీ కార్డులివ్వాలి. దీంతో ఇతరులు రాకుండా నిరోధించవచ్చు.
వనరుల వాడకానికి ఎంత చార్జి వేయాలన్నది ఇరుసంస్థలు కలిసి నిర్ణయించుకోవాలి.