హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, రాజేశ్వరరావు పదవీకాలం ముగియడంతో వారి స్థానాల్లో వీరిని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. సంగారెడ్డికి చెందిన కుర్రా సత్యనారాయణ జనతాపార్టీ, బీజేపీలో పనిచేశారు. 1999లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సత్యనారాయణ 2018 వరకు బీజేపీలోనే ఉన్నారు.
ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిరసనగా రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రతిపాదించడంపై సీఎం కేసీఆర్‌కు కుర్రా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ దాసోజు శ్రవణ్ బీసీ వర్గాల బలమైన గొంతుకగా ఎదిగారు. ప్రజారాజ్యంలో కొంతకాలంపాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి పలు హో దాల్లో పనిచేశారు. తెలంగాణ కోసం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి బీఆర్ఎస్ సమర్పించిన చారిత్రక నివేదిక రూపకల్పన బృందం లో సభ్యుడిగా పనిచేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తనపేరు ప్రతిపాదించడంపై సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.