Kunamneni Sambasivarao | కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఊరట లభించింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని నందూలాల్ అగర్వాల్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూనంనేని కనిబంధనల మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేయలేదని కొత్తగూడెం పట్టణానికి చెందిన నందూలాల్ హైకోర్టును ఆశ్రయించారు. కూనంనేనిపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, నందూలాల్ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కూనంనేని హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు.. పిటిషన్‌ను క్వాష్ చేయడానికి నిరాకరించింది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరగాల్సి ఉందని తెలిపింది. దీంతో ఈ తీర్పును సవాలు చేస్తూ కూనంనేని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తనపై దాఖలు అయిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ కూనంనేని వేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం.. సరైన ఆధారాలు లేవంటూ నందూలాల్ అగర్వాల్ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తుదితీర్పు వెలువరించింది.
ఈ తీర్పుపై కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ప్రజాక్షేత్రంలో గెలుపొందడం ద్వారా ప్రజా విజయం సాధించామని.. తాజాగా తన ఎన్నిక చెల్లందంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం ద్వారా న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్థ పట్ల మరింత విశ్వాసం, గౌరవం ప్రజలలో పెరిగిందని అన్నారు. లక్షలాది మంది ఓట్లు వేసి గెలిపించినప్పటికీ, వారి మనోభావాలకు భిన్నంగా అడ్డదారుల్లో ప్రయోజనం పొందాలని అనుకునేవారికి ఈ తీర్పు చక్కటి గుణపాఠం అని చెప్పారు. ఈ తీర్పు ద్వారా ప్రజా సేవలో ద్విగుణీకృతమైన ఉత్సహంతో పనిచేసేందుకు మరింత స్పూర్తిని కలిగించిందని సాంబశివరావు తెలిపారు.