కుమ్రంభీం ఆసిఫాబాద్ ఏప్రిల్ 19: (నమస్తే తెలంగాణ) : ‘జల్.. జంగిల్.. జమీన్’ కోసం పోరా డి వీరమరణం పొందిన కుమ్రంభీం మనుమడు సోనేరావు కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నది. కేసీఆర్ సర్కార్లో గౌరవంగా బతికిన వారంతా.. ప్రస్తుతం ఉపాధి పనులకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ సర్కార్ కుమ్రం భీం కుటుంబానికి తగిన ప్రాధాన్యం కల్పించింది. భీం చరిత్రను ప్రపంచానికి చాటింది. ఆయన కుటుంబా న్ని అన్ని రకాలుగా ఆదుకొని అండగా నిలిచింది. భీం మనుమడు సోనేరావుకు ఐదెకరాల పట్టాభూమి ఇవ్వడంతోపాటు ఆయన కుమారుడు మాధవరావుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం కల్పించింది.
సోనేరావు ఇద్దరు కూతుళ్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. సోనేరావు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండలం పెద్దదోభ గ్రామంలో నివాసముంటుండగా, పక్కా ఇల్లు కూడా నిర్మించి ఇచ్చింది. పోరుగడ్డ జోడేఘాట్లో రూ. 25 కోట్లతో మ్యూజియం, స్మారక చిహ్నం ఏ ర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది. రూ. 15.70 కోట్లతో జోడేఘాట్ వరకు డబుల్ రోడ్డు నిర్మించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏడాదిన్నరగా భీం కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. భీం మనుమడు సోనేరావు.. ఆయన భార్య గౌరుబాయి నిత్యం ఉపాధి పనులకు వెళ్తున్నారు. కాంగ్రెస్ సర్కారు తమను ఆర్థికంగా ఆదుకోవాలని సోనేరావు దంపతులు వేడుకుంటున్నారు.