హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : వినాయక చవితి పండుగను ప్రకృతికి హాని కలుగకుండా పర్యావరణహితంగా జరుపుకోవాలని, మట్టి వినాయకులనే పూజించాలని ప్రజలకు కేటీఆర్, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను గ్రీన్ ఇండియా చాలెంజ్ బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవేందర్ ప్రత్యేకంగా రూపొందించిన సీడ్ గణేశా విగ్రహాన్ని కేటీఆర్‌కు అందజేశారు. సీడ్ గణేశా ప్రత్యేకతను కేటీఆర్‌కు వివరిస్తూ.. పూజల అనంతరం ఇంటి ఆవరణలో లేదా పూల కుండీలో ఉంచి నీరు పోయగానే మట్టి విగ్రహం కరిగిపోయి, దానిలో పొదిగిన విత్తనాలు మొలకెత్తి పచ్చని మొకగా ఎదుగుతాయని చెప్పారు.
సహజసిద్ధమైన మట్టి, కోకోపిట్, కొబ్బరిపీచుతో రూపొందించిన ఈ విగ్రహాల్లో వేప, చింతవంటి స్థానిక వృక్షాల విత్తనాలను నిక్షిప్తం చేసినట్టు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘హరితహారం’ స్ఫూర్తితో 2018లో మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం ‘3 మొకలు నాటండి, మూడేండ్లు సంరక్షించండి, మరో ముగ్గురిని నామినేట్ చేయండి‘ అనే నినాదంతో విజయవంతంగా కొనసాగుతున్న సంగతిని గుర్తుచేశారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం తన నివాసంలో సీడ్ గణేశా విగ్రహాలను ఆవిషరించి ఉద్యమానికి భారీ మద్దతు పలికారని నిర్వాహకులు కేటీఆర్‌కు తెలిపారు. పీవోపీ విగ్రహాలు, రసాయన రంగుల వినియోగం వల్ల నదులు, చెరువులు తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రకృతికి నష్టం వాటిల్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని గుర్తుచేశారు. అందరూ సీడ్ గణేశా విగ్రహాలనే ప్రతిష్ఠించి వినాయక ఉత్సవాలను అర్థవంతమైన పర్యావరణ ఉద్యమంగా మార్చాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.