జై కొట్టిన సింగరేణి
గులాబీ జెండాకు సింగరేణి జైకొట్టింది. నల్లనేలపై కార్మికలోకం గర్జించింది. కోల్‌బెల్ట్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. దీంతో ఎటుచూసినా జాతరను తరలిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే నల్లనేలపై బుధవారం సమరభేరి మోగింది. సింగరేణి భద్రత, కార్మికుల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ విజయవంతమైంది.
- జాతరను తలపించిన నల్లనేల
- గర్జించిన గని కార్మికలోకం
- గోదావరిఖని గడ్డపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమరభేరి
- సింగరేణి కార్మిక గర్జన సక్సెస్
- బీఆర్ఎస్ పార్టీ, టీబీజీకేఎస్‌పై కార్మికుల్లో తరగని అభిమానం
- కాంగ్రెస్ సర్కార్ ప్రలోభాలకు తలొగ్గకుండా తరలివచ్చిన కార్మికులు
- కోల్‌బెల్ట్ నుంచి భారీగా రాక
- కిక్కిరిసిన జేఎల్ఎన్ స్టేడియం
- చైతన్యం నింపిన కేటీఆర్ ప్రసంగం.. బీజేపీ, కాంగ్రెస్‌పై నిప్పులు
- అవినీతి చేసిన కాంగ్రెస్‌ను వదిలేది లేదు.. అంతుచూడాలని పిలుపు
- కేసీఆర్‌తోనే సింగరేణి బతుకుతదని స్పష్టీకరణ
కరీంనగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పెద్దపల్లి (నమస్తే తెలంగాణ): గులాబీ జెండాకు సింగరేణి జైకొట్టింది. నల్లనేలపై కార్మికలోకం గర్జించింది. కోల్‌బెల్ట్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. దీంతో ఎటుచూసినా జాతరను తరలిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే నల్లనేలపై బుధవారం సమరభేరి మోగింది. సింగరేణి భద్రత, కార్మికుల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నిర్వహించిన ‘సింగరేణి కార్మిక గర్జన’ విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రలోభాలకు తలొగ్గకుండా భారీగా తరలివచ్చిన కార్మికలోకం అభిమానం చాటుకున్నది. వేలాది మందితో గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పోటెత్తింది.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో సింహగర్జన చేసింది. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి కుంభకోణాలమయంగా మారడం, కార్మికుల ప్రయోజనాల విస్మరింపు, హామీలు అమలుకు నోచుకోకపోవడం వంటి సమస్యలను కేటీఆర్ కార్మికుల కండ్ల ముందుంచారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో సింగరేణిని లాభాల బాట పట్టించడం, కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం, కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించడం, లాభాలా వాటా పెంచడం.. ఇలా అన్ని రకాలుగా ప్రోత్సహించిన తీరును కేటీఆర్ వివరించగా, కార్మికలోకం గుర్తు చేసుకున్నది. సింగరేణిని నిర్యీర్యం చేసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టేది లేదని, కచ్చితంగా బుద్ధి చెప్తామని ప్రతినబూనింది. మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే సింగరేణి బతుకుతుందని, బీఆర్ఎస్ జెండా ఎగురవేసుకుందామని కేటీఆర్ పిలుపునకు నల్లనేల జైకొట్టింది.

పోటెత్తిన జేఎల్ఎన్ స్టేడియం
గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సింగిరేణి కార్మిక గర్జన’ భారీ బహిరంగ సభకు కార్మికులు పోటెత్తారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ పెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కాంగ్రెస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా తలొగ్గకుండా బీఆర్ఎస్, టీబీజీకేఎస్‌పై కార్మికలోకం అభిమానం చాటుకున్నది. సభకు ఒకరోజు ముందుగానే లాభాల వాటా ప్రకటించినా.. కార్మికులు అవేవీ లెక్క చేయకుండా కేటీఆర్ మీటింగ్‌కు కదలి వచ్చారు. పెద్దపల్లి జిల్లాతోపాటు కోల్‌బెల్ట్‌లోని ఆరు జిల్లాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బైక్‌లు, కార్లు, ఇతర ప్రత్యేక వాహనాల్లో గులాబీ జెండాలు ప్రదర్శిస్తూ.. దారి పొడవునా ‘జై కేసీఆర్’ ‘జై కేటీఆర్’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. సభ సాయంత్రం 5 గంటలకు ఉండగా, అప్పటికే స్టేడియంలో కిక్కిరిసిపోయారు. కేటీఆర్ వచ్చే వరకు ఉత్సాహంగా ఎదురు చూశారు.
ఆయన రాగానే ఒక్కసారిగా చప్పట్లతో స్వాగతించారు. ‘జై తెలంగాణ’ ‘జై కేసీఆర్’ ‘జై కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు. వేదికపైకి వచ్చిన కేటీఆర్ సింగరేణి భవిష్యత్తు, కార్మికుల భద్రతపై గళమెత్తారు. 60 నిమిషాలపాటు ఆయన ప్రసంగించారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణిని అవినీతి, అక్రమాలమయంగా మారిన తీరు, కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడం, సంస్థ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా నిర్ణయాలు తీసుకోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నాలు వంటి అంశాలను కండ్లకు కట్టినట్టుగా వరించిన తీరు కార్మికులను ఆలోచింపచేసింది.
గోల్మాల్ దొంగ ఎవడు? కార్మికులకు అండ ఎవరు?
‘కాంగ్రెస్ వచ్చింది. కరెంట్ పోయింది’ కరెక్టేనా? అని కేటీఆర్ తన ప్రసంగంలో ప్రశ్నించగా.. అవును అంటూ కార్మికులు చేతులు పైకెత్తి పలికారు. సిరుల సింగరేణిని దోచుకున్నదెవడు? కోల్మాల్.. గోల్మాల్ దొంగ ఎవడు? నైనీ టెండర్ల వ్యవహారంలో 30 వేల కోట్లు మింగుదామని అనుకున్నది ఎవడు? ఉత్పత్తి పడిపోవడానికి కారణం ఎవడు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘రేవంత్.. రేవంత్’ అంటూ కార్మికులు సమాధానం ఇచ్చారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల పట్టించడం, కార్మికులకు అన్ని రకాలుగా అండగా నిలువడం, కార్మిక కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని వివరించి చెప్పగా.. నిజమేనంటూ కార్మికులు సంకేతం ఇచ్చారు.
ఆనాడు సింగరేణిని అవినీతి అనకొండ నుంచి కాపాడుకున్నదెవరు? కార్మికులకు అండగా నిలిచిందెవరు? అని ప్రశ్నించగా.. ‘జై కేసీఆర్’ అంటూ సభికులు నినదించారు. మొత్తంగా కేటీఆర్ సుదీర్ఘ ప్రసంగానికి ఫిదా అయిన కార్మికులు, సింగరేణి మనుగడపై గురించి ఆలోచనలో పడిన తీరు కనిపించింది. ధోకా చేసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేయగా, మేమంతా మీ వెంటే నంటూ కార్మికులు చేతులెత్తి జైకొట్టారు. సర్కార్ మాయమాటలను నమ్మేది లేదని, పోరాటం తప్ప మరో మార్గం లేదని కేటీఆర్ చెప్పగా, మేము మీ వెంటే అంటూ నినాదాలు చేసిన తీరు అందరినీ ఆకట్టుకున్నది.
కాంగ్రెస్ అవినీతిని వివరించిన కేటీఆర్

స్వరాష్ట్ర సాధనలో ఆనాడు సింగరేణి కార్మికులు చేసిన పోరాటాలు, త్యాగాలను గుర్తు చేస్తూనే.. కాంగ్రెస్ హయాంలో సింగరేణి పతనం ఎలా సాగుతున్నది? దీని వెనుక కుట్రదారులెవరు? ప్రైవేటీకరణ చేసేందుకు కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలేమిటి? బొగ్గు ఉత్పత్తి చేయడంలో సర్కార్ తప్పును సింగరేణిపైకి నెట్టడం వెనుక జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు టెండర్ల వ్యవహారంలో జరిగిన గోల్మాల్, తద్వారా దోపిడీ జరుగుతున్న వేల కోట్లు వంటి అంశాలను కండ్లకు కట్టినట్టుగా కేసీఆర్ వివరించిన తీరు కార్మికులను ఆలోచింపజేసేలా చేసింది. మళ్లీ పూర్వవైభవం రావాలన్నా.. సింగరేణిని కాపాడుకోవాలన్నా దానికి కేసీఆరే శ్రీరామరక్ష అంటూ కేటీఆర్ వివరించగా.. అవును అంటూ కార్మికులు పిడికిళ్లెత్తి సంకేతం ఇచ్చారు.
కేటీఆర్ నయా లుక్!

పెద్దపల్లి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త రూపంలో కనిపించారు. ఎప్పుడూ నీట్ షేవ్‌తో స్మార్ట్‌గా ఉండే ఆయన.. బుధవారం గోదావరిఖనిలో సభా వేదికపైకి రాగానే.. స్వల్పమైన గడ్డం షేప్తోపాటు మీసకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేటీఆర్ తన ఉపన్యాసం ఆరంభంలోనే ఈ కొత్త లుక్‌పై ఓ క్లారిటీ ఇచ్చారు. ‘తాను కరీంనగర్‌కు రాగానే మాజీ మంత్రి గంగుల కమలాకర్ గమనించి ఏందన్నా.. కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు..’ అని అడిగారు. ‘మనం వెళ్లేది పోరాటాల గడ్డ.. ఉద్యమాల గడ్డ.. ఈ మాత్రం లేకపోతే ఎలా’.. అని గంగుల కమలాకర్‌కు సమాధానం చెప్పానని అనడంతో సభికులు హర్షధ్వానాలు వ్యక్తంచేశారు. కేటీఆర్ నయాల్ అచ్చాహై! అంటూ అందరూ కితాబిచ్చారు.
ఇది అంతం కాదు.. ఆరంభమే

సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడైతే అన్యాయం జరుగుతదో అక్కడ కేసీఆర్ అడుగుపెట్టగానే ఆనాటి ప్రభుత్వాలు జంకి తక్షణ నిర్ణయాలు తీసుకున్న రోజు లు చూసినం. మొన్న కరీంనగర్లో సభపెట్టి రైతుబంధు గురించి నిలదీస్తే రైతుబంధు వచ్చింది. ఇప్పుడు సింగరేణి కార్మిక గర్జన పెడితే.. లాభాలవాటా వచ్చింది. సమైక్య రాష్ట్రంలో చిక్కి శల్యమైన సింగరేణి సంస్థ మనుగడ కోసం స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నరు. పదేండ్ల పాలనలో సంస్థ ప్రగతి, కార్మిక సంక్షేమం కోస అడుగకుండానే అనేక కార్యక్రమాలు అమలు చేసిండు. కానీ ఇప్పుడు సంస్థ నిర్వీర్యమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంస్థ సర్వనాశనమవుతూ వస్తున్నది. అనేకమైన కుంభకోణాలు జరుగుతున్నయ్. ఎన్నికల ముందు 39 వాగ్దానాలు చేసి, ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. అలాంటి దుర్మార్గమైన ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసమే ఇవ్వాళ బీఆర్ఎస్, టీబీజీకేఎస్ కార్మిక గర్జన పెట్టినం.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
కేటీఆర్ సభపెడితేనే లాభాల వాటా వచ్చింది

కేటీఆర్ అనే మరో మూడక్షరాల పేరు విం టేనే అధికార పార్టీ భయపడుతున్నది. గడిచిన మూడేండ్లుగా సింగరేణిని ఏ మాత్రం పట్టించుకోని రేవంత్‌రెడ్డి స ర్కార్.. కేటీఆర్ గోదావరిఖనిలో సభ పెడుతామని చెప్పడంతోనే లాభాల ప్రకటన చేయడం, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం చూస్తుంటే కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి భయపడుతున్నట్టు అర్థమవుతున్నది. కేటీఆర్ అంటేనే ఆయనకు నిద్రలో కూడా చెమటలు పడుతున్నాయి. కార్మికులు, ప్రజాసమస్యలను మరచి పనికిరాని మాటలు మాట్లాడుతున్న రేవంత్‌కు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేనో ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అవే పరిస్థితులు కనబడుతున్నాయి.
– బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్
కేటీఆర్ పర్యటన నూతనోత్సాహం

సింగరేణి కార్మికుల సమస్యలపై చర్చించేందుకు, సంస్థ పరిరక్షణకు దిశానిర్దేశం చేసేందుకు కేటీఆర్ గోదావరిఖనికి రావడం కొత్త ఉత్సాహా న్ని నింపింది. సింగరేణి సంస్థ అస్తిత్వాన్ని, అపారమైన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉన్నది. రాజకీయ జోక్యం, అవినీతి ఆరోపణలతో సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్నరు. కార్మికుల ప్రయోజనాలు, సంస్థ భవిష్యత్తును కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలి. సింగరేణి పరిరక్షణ కోసం కేటీఆర్ చేస్తున్న పోరాటాలు అభినందనీయం. సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కేటీఆర్ ప్రశ్నిస్తూ కార్మికుల పక్షాన ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తున్నారు. సింగరేణి ప్రయోజనాలను కాపాడటంతో పాటు రామగుండం అభివృద్ధికి మా పోరాటం కొనసాగిస్తాం.
– కోరుకంటి చందర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే
లాభాల వాటా కాదు.. కోతల వాటా

సింగరేణి సంస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం కా ర్మికులకు కోతలు విధించిన వాటా చెల్లిస్తూ తాము గొప్పగా లాభాల వాటా ఇచ్చినట్టు చెప్పుకొంటున్నది. కార్మికులకు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల వాటాను కేటీఆర్ భయంతో ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కార్మికులకు ఎప్పుడు ఇవ్వనున్నదో చెప్పలేదు. దసరా సమీపిస్తున్నా కార్మికుల ఖాతాలో డబ్బులు జమకాలేదు. సింగరేణిలో కాంగ్రెస్ పాలన స్కీమ్‌లు, స్కామ్లుగానే మిగిలిపోయింది. సీఎం అనుచరులకు ఓబీ కాంట్రాక్టులు కట్టబెట్టడం, డీజిల్ కుంభకోణం, థర్మల్, సోలార్ కుంభకోణాలతో సింగరేణి అవినీతిమయంగా మారిపోయింది. ప్రతిరోజు కోటి రూపాయల అప్పుతో సింగరేణిని దివాలా తీయిస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

