హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ‘సెప్టెంబర్ 14 వినాయక చవితిలోపు సాగర్ ప్రాంత రైతులకు నీళ్లు ఇచ్చే షెడ్యూల్ విడుదల చేయాలి. లేకపోతే వేలాది మంది రైతులతో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తా’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. సాగర్ ఎడమ కాల్వ కింద మిర్యాలగూడ నుంచి మధిర వరకు రైతుల పంటలు ఎండిపోతున్నాయని, ఆ ప్రాంత రైతులందరికీ సాగర్ నీళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై మిర్యాలగూడలో నిర్వహించిన ‘రైతు మహాధర్నా’ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలన చూశారు.. వెయ్యి పడగల విషమున్న పాము కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను కూడా ప్రజలు చూస్తున్నారని చెప్పారు.
మిర్యాలగూడలో భాస్కర్‌రావు, జగదీశ్‌రెడ్డిలు నాగార్జునసాగర్ నీళ్ల కోసం ధర్నా చేస్తే.. రేవంత్ సర్కార్‌కు చలి జ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు. 2003లో కూడా ఇదే కరువు పరిస్థితి ఉంటే.. కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి, అప్పుడున్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, నీళ్లు విడుదల చేయించడంలో పోరాటం చేసి విజయం సాధించారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్‌లాగే.. తాను కూడా అలాగే ధర్నా చేయాలని జగదీశ్‌రెడ్డి సూచించారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. వేలాదిగా రైతన్నలు తరలివచ్చి మరొకసారి సత్తా చాటారని కేటీఆర్ కొనియాడారు.

Ktr
మిర్యాలగూడ వేదికగా ప్రభుత్వానికి చేస్తున్న హెచ్చరిక ఒక్కటే. మీకు సరిగ్గా పది రోజలు గడువు ఇస్తున్నాం. సెప్టెంబర్ 14 వినాయక చవితి పండుగలోపు నీళ్లు ఇచ్చే షెడ్యూల్ విడుదల చేయాలి. ఎన్ని నీళ్లు, ఎన్ని తడులకు ఇస్తారో ప్రకటించాలి. లేకపోతే వేలాది మంది రైతులతో కోదాడ నుంచి హాలియా వరకూ పాదయాత్ర చేస్తం. మీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకూ పోరాటం చేస్తం.
– కేటీఆర్
నీళ్ల కోసం ఎడమ కాల్వ రైతుల పోరుబాట
కేసీఆర్ హయాంలో తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చారని, ధాన్యభాండాగారంగా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో వరి అద్భుతంగా నల్లగొండలో ఎక్కువగా పండిందని, రైస్‌బౌల్ ఆఫ్ తెలంగాణలో రైసు మిల్లులు మిర్యాలగూడలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. పదేండ్లు పచ్చని మాగాణంలా ఉన్న మిర్యాలగూడలో రైతులు నీళ్ల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘కేసీఆర్ పాలనలో ధీమాగా బతికిన రైతులు.. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే తల్లడిల్లారు.
నీళ్లిస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితుల్లో మిర్యాలగూడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్, సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఎడమ కాల్వ కింద ఉన్న రైతులందరూ నీళ్ల కోసం పోరుబాట పట్టారు. మళ్లీ కేసీఆర్ రావాలని, ఆయనే గర్జిస్తేనే.. ఈ ప్రభుత్వం దిగొస్తదని రైతు ధర్నాకు పిలుపునిచ్చారు’ అని కొనియాడారు. ‘నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో ఒక సంక్షోభం వస్తుంది. రైతుల గుండెనిండా ఆవేదన అలుముకొని ఉన్నది’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.

సాగర్‌లో నీళ్లు ఉన్నా.. మంత్రుల నోట్లో శని
‘సాగర్‌లో నీళ్లు ఉన్నా.. ఈ జిల్లాలను నడుపుతున్న ఇద్దరు మంత్రులు రైతుల పాలిట శనిలా దాపురించారని కేటీఆర్ విమర్శించారు. కండ్లుండీ చూడలేని కబోదులు నల్లగొండ మంత్రులని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీశైలంలో 870 అడుగులపైన నీళ్లున్నా, సాగర్‌లోనూ నీళ్లున్నా.. వారికి ఇవ్వడం చేతకావడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో 875 అడుగులకు నీళ్లు రాగానే పని మొట్టమొదలు పెట్టేవారని చెప్పారు.
‘శ్రీశైలం ఎడమ కాల్వపై ఉన్న జల విద్యుత్ కేంద్రం నుంచి 40-50 టీఎంసీల నీళ్లు సాగర్‌కు కిందికి నీళ్లు వదిలేవారు. కుడి కాల్వకు వదిలేకంటే ముందు మనకు నీళ్లు వచ్చేది. శ్రీశైలం గేట్లు తెరిచేలోపే.. సాగర్‌కు నీళ్లు వచ్చేది. ఎంతటి కరువు ఉన్నా.. సాగర్ కింద వానకాలం, ఎండకాలం పంటలకు నీళ్లు వచ్చేవి. ఈ సీజన్లో కూడా అవకాశం ఉన్నది. సాగర్‌లో ప్రస్తుతం 180 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. దాన్ని విడుదల చేయడానికి సంపూర్ణ అవకాశం ఉంది. అయినా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
గురుదక్షిణ కింద వెలిగొండకు నీళ్లు!
‘ఇక్కడేమో నికర జలాలు ఉన్నా.. పంటలు ఎండిపోతున్నా నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ నేతలు వరద జలాలపై ఆధారపడి ఏపీకి కట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ఏ వరద లేకపోయినా కిందికి నీళ్లు వదులుతున్నారు. దీనిపై ఇక్కడున్న సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కమాట మాట్లాడడు. గురుదక్షిణ కింద గమ్మునున్నాడు’ అని కేటీఆర్ విమర్శించారు. ‘ఏమైనా గట్టిగా మాట్లాడితే.. చంద్రబాబు ఓటుకు నోటు కేసు గట్టిగా కదులతది. మళ్లీ రేవంత్‌రెడ్డి జైలుకుపోయే పరిస్థితి వస్తుంది.
దానిని అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రే హారతులు పడుతున్నాడు. ప్రశ్నించాల్సిన మంత్రులు పట్టపగలే మొద్దునిద్ర పోతున్నారు. మిగులు జలాల మీద కట్టిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తుతున్నా సోయి లేదా?’ అని ప్రశ్నించారు. అటు పోతిరెడ్డిపాటు నుంచి వెలిగొండ నుంచి నీళ్లు పోతున్నా.. మనకు ఎడమ కాల్వకు నీళ్లు రావు, మా రైతన్నలకు టైము ఇచ్చే పరిస్థితి లేదు’ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. నీళ్ల కోసం మంత్రిని అడిగేందుకు ఒంటెద్దు నర్సింహారెడ్డితో కలిసి వెళ్లిన హుజూర్నగర్ రైతులను ‘మీకు నీళ్లు ఎక్కడివి? మీకు నీళ్లు ఇచ్చే సమస్య ఎక్కడిది? పొండి పొండి అని తరుముతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Ktr
రేవంత్‌రెడ్డీ.. సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతులు ఏం పాపం చేశారు? వాళ్లు నీకు ఏం ద్రోహం చేశారు? నీకు ఓట్లు వేసి, నీ ఎమ్మెల్యేలను గెలిపించి, నిన్ను ముఖ్యమంత్రిని చేయడమే ఈ ప్రాంత రైతులు చేసిన తప్పా? మిర్యాలగూడ, పాలేరు, మధిర, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ జిల్లాల రైతులకు వెంటనే నీళ్లివ్వాలి.
– కేటీఆర్
రైతు సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతాం
రైతులు సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతామని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘రుణమాఫీ కాదు.. బోనస్ రాదు.. రైతన్నలకు కనీసం యూరియా దొరుకని దుస్థితి వచ్చింది. వేలాదిగా తరలివచ్చిన రైతన్నలకు నా ప్రార్థన ఒక్కటే.. ఇక ఆదమర్చేది లేదు. మీకు అండగా కేసీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ దళం ఉన్నది. 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం గల్లా పడ్తాం. నీళ్ల కోసం నిలదీస్తాం. అప్పుడు స్పష్టత రాకపోతే.. గణేశ్ పండుగ వరకూ చూసి కార్యాచరణ ప్రకటిద్దాం, ఉద్యమానికే పోదాం.. ప్రభుత్వం మెడలు వంచేదాక మీరంతా కలిసిరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అని కేటీఆర్ కోరారు.
మిర్యాలగూడ రైతు ధర్నా సక్సెస్
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ)/మిర్యాలగూడ : మిర్యాలగూడలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు విశేష స్పందన వచ్చింది. అటు శ్రీశైలం.. ఇక్కడ నాగార్జునసాగర్‌లో నీళ్లు న్నా ఇవ్వకుండా సాకులు చెప్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై రగిలిపోయిన రైతులు దండులా కదిలిరావడంతో ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ పోటెత్తింది. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సభకు ఊహించని విధంగా ఎడమకాల్వతోపాటు ఏఎంఆర్పీ, వరద కాలువ ఆయకట్టు రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు.
అంతకుముందు పట్టణంలో దారి పొడవునా భారీ జనసందోహం, రైతులు బారులు తీరిన కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. వేదిపైకి కేటీఆర్ చేరుకోగానే ఈలలు, చప్పట్లతో సభా ప్రాంగణం హోరెత్తించారు. కాంగ్రెస్ సర్కార్‌తోపాటు స్థానిక మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిపై కేటీఆర్ పంచ్‌లు వేసి, వారి తీరును ఎండగట్టినప్పుడు రైతుల నుంచి హార్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ఇక రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌ను, రేవంత్‌రెడ్డి చెప్పిన హామీల వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శిస్తూ.. ప్రశ్నలు వేసినప్పుడు జనం చప్పట్లతో స్పందించారు. నీళ్ల కోసం సర్కార్‌కు హెచ్చరికలు చేసి.. పాదయాత్రకైనా సిద్ధమని కేటీఆర్ ప్రకటించడంతో రైతులు జైకొట్టారు.
రైతుబంధు ఎగ్గొట్టిన కాంగ్రెస్
ఎన్నికల ముందు ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలను ప్రజలకు కేటీఆర్ వివరించారు. కేసీఆర్ 10వేలు ఇస్తే.. కాంగ్రెస్ 15వేలు ఇస్తుందని, 3 పంటలకు ఇస్తామని, కౌలు రైతులకూ రైతుబంధు ఇస్తామని మోసగించారని మండిపడ్డారు. వరి, మక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి దగా చేశారని తెలిపారు. నాడు రైతు డిక్లరేషన్ సందర్భంగా రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఇచ్చిన బూటకపు హామీలను స్క్రీన్‌పై చూపించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఎవరికైనా రైతుబంధు 15వేలు వచ్చిందా?’ అని ప్రశ్నించారు. ‘రాలేదు.. రాలేదు’ అంటూ జనాల్లోంచి భారీగా స్పందన వచ్చింది.

రక్తం రుచి మరిగిన కాంగ్రెస్ అనే పులి మళ్లీ వచ్చింది. మనం మన ప్రాంత రైతులకు నీళ్లు ఇవ్వాలని అడుగుతున్నం. నీళ్లు ఇవ్వుమన్నందుకు బీఆర్ఎస్ వాళ్లను కోసి, ఆ రక్తంతో పంట పొలాల్లో చల్లుతామని రేవంత్‌రెడ్డి అంటున్నడు. అలాంటి రక్తపిశాచి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం
– కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ అడిగిన పలు ప్రశ్నలకు సభికులు ఇలా బదులిచ్చారు.
సీఎం, మంత్రులు.. ఆంధ్రా పాలకుల తొత్తులు నల్లమోతు భాస్కర్‌రావు
రైతుల కంట కన్నీరు తెప్పిస్తే ఎలాంటి పాలకులైనా వారి ఆగ్రహావేశంలో భస్మం కాక తప్పదని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఆంధ్రా పాలకులకు తొత్తులుగా మారి, నీటి దోపిడీని అడ్డుకోలేని దద్దమ్మలా మిగిలిపోయారని ధ్వజమెత్తారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో మిర్యాలగూడ అభివృద్ధి కోసం ఇప్పటివరకూ స్థానిక ఎమ్మెల్యే ఒక రూపాయి కూడా తీసుకురాలేదు…. తీసుకురాలేడు కూడా అని చురకలంటించారు. మళ్లీ కేసీఆర్, కేటీఆర్ వస్తేనే మిర్యాలగూడ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతాంగానికి నీరు అందించి ఆదుకునేలా కృషి చేయాలని కేటీఆర్‌ను కోరారు.