మునుగోడు రూరల్, నవంబర్ 1: తీవ్ర అనారోగ్యంతో బాధపడున్న పేదింటి చిన్నారికి సొంత ఖర్చుతో శస్త్రచికిత్స చేయిస్తానని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. చికిత్స కోసం చిన్నారిని హైదరాబాద్‌కు పంపించారు. నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామానికి చెందిన శంకరయ్య, లావణ్య దంపతుల ఏడేండ్ల కుమార్తె లక్కీకి అవయవాల చికిత్స చేయాల్సి ఉన్నది. శస్త్రచికిత్సకు పెద్దమొత్తంలో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. శంకరయ్య మునుగోడులో జోసెఫ్ స్కూల్లో బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఖర్చు భరించే ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు బాధపడుతుండేవారు.
ఇటీవల పాప దయనీయ పరిస్థితిని టీఆర్ఎస్ మునుగోడు టౌన్ ఇన్చార్జి, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌కు ఆమె తల్లిదండ్రులు వివరించారు. ఈ విషయాన్ని ఆయన మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. మంత్రి సూచన మేరకు మంగళవారం తల్లిదండ్రులు తమ చిన్నారితో హైదరాబాద్‌కు వెళ్లి ప్రముఖ ప్రైవేటు దవాఖానలో సంప్రదించారు. చిన్నారికి మూడు వారాల్లో శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు చెప్పారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తిరిగి గ్రామానికి వచ్చారు.
తక్షణమే సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, బాబా ఫసియుద్దీన్‌కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి అనారోగ్యంపై మూడేండ్ల కిందటే అప్పటి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి వివరించగా.. శస్త్రచికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారని, కానీ నేటికీ పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. దొంగ హామీలు ఇచ్చి పాప జీవితంతో ఆడుకున్న రాజగోపాల్‌రెడ్డికి తామే కాకుండా నియోజకవర్గంలోని ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. పేదల పక్షాన నిలబడ్డ కారు గుర్తుకే ఓటు వేస్తామని ఆనందంగా తెలిపారు.