KTR | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. రేపు (ఏప్రిల్ 27న) తెలంగాణ భవన్లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు.
ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో, ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని పార్టీ స్పష్టం చేసింది.
తెలంగాణ భవన్లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని, ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని, మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ కోరారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం, మండలం, పట్టణం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉదయాన్నే స్థానిక ప్రాంతాల్లో జెండా పండుగ ముగించుకుని, మధ్యాహ్నం 1:30 గంటల కల్లా హైదరాబాద్ చేరుకోవాలని దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులకు సూచించారు.