Tollywood | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటులు, ఇతర ప్రముఖులు భగ్గుమన్నారు. ఆమె జుగుప్సాకర వ్యాఖ్యలంటూ తీవ్రంగా మండిపడ్డారు.
సమంత, నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు…సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా? జస్ట్ ఆస్కింగ్’ అని ఈసడించుకున్నారు.
– సినీనటుడు ప్రకాశ్‌రాజ్
తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన ప్రతీ వ్యాఖ్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆమె చేసిన వ్యాఖ్యలు చూసి షాక్ అయ్యా. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలి. అక్కినేని నాగార్జున కుటుంబంపై బాధ్యతారహిత, గౌరవాన్ని భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన సురేఖతో తక్షణం క్షమాపణలు చెప్పించాలి. కొండా సురేఖ తెలివిలేని మాటలను సినీ పరిశ్రమలోని ప్రతిఒక్కరు ఖండించాలి. =
– కోన వెంకట్, సినీ నిర్మాత
రాజకీయ మైలేజీ కోసం ఓ మహిళా మంత్రి ప్రముఖ సినీనటి సమంతపై నిరాధారమైన ఆరోపణలు, వ్యాఖ్యలు చేయడం నీచమైన రాజకీయాలకు పరాకాష్ఠ. మహిళ అయి ఉండి మరో మహిళపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం.
– అక్షితా నందగోపాల్, పాత్రికేయురాలు
అధికారం అనేది ఒక బాధ్యత. కొండా సురేఖ రాజకీయ వివాదాల్లోకి వాటితో ప్రమేయం లేని వ్యక్తులను లాగారు. అభియోగాలు నిజమైతే కేటీఆర్‌పై న్యాయపరమైన చర్యలకు ఎందుకు వెళ్లడం లేదు? మీ తీరును చూసి సిగ్గుపడుతున్న.
– వేణు ఉడుగుల, సినీ దర్శకుడు
అనేక మంది, తెలుగు యూట్యూబ్ చానెళ్లు, మీడియాలు సమంత పేరును సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. వ్యూస్ ద్వారా డబ్బు సంపాదించడానికి చూస్తున్నారు. నవరాత్రి సమయంలో వారు తమ సొంత కర్మల కారణంగా దగ్ధమవ్వాలని కోరుకుంటున్నా.
-చిన్మయి శ్రీపాద, సినీ గాయని
సమంత, నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హేయం. మంత్రి ఒక మహిళ అయి ఉండి తోటి మహిళపై హేయమైన వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. అక్కినేని కుటుంబంపై, సుమంతపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నిరాధారమైన ఆరోపణలు, వ్యాఖ్యలు చేయడం నీచమైన రాజకీయాలకు పరాకాష్ఠ. సురేఖపై పెట్టిన అభ్యంతరకర పోస్టులను సమాజం వ్యతిరేకించింది. దీన్ని ఆసరా చేసుకొని తోటి మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఆమెకు మనసెలా వచ్చింది. రాజకీయ వివాదాల్లోకి సంబంధంలేని మహిళను తీసుకురావడం దుర్మార్గం. ఆ పనిని మహిళే చేయడం మరింత బాధిస్తున్నది. ఇలాంటి వేదనాభరిత పరిస్థితి నుంచి అక్కినేని కుటుంబం, సమంత మనోధైర్యంతో అధిగమిస్తారని ఆశిస్తున్నా.
– రోజా సెల్వమణి, ఏపీ మాజీ మంత్రి