హైదరాబాద్, మే 3(నమస్తే తెలంగాణ)/పెంబి : రోడ్డు ప్రమాదంలో ఒకేరోజు ఇద్దరు కూతుళ్ల దుర్మరణం.. పరాయి దేశంలో ఉండి వారి కడసారి చూపునకు నోచుకోలేని తండ్రి.. ఆయనది కనీసం సొంత గ్రామానికి రాలేని పరిస్థితి.. ఇంతటి విషాద ఘటనతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఘటనకు సంబంధించిన వివరాలు.. నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతర్యతండాకు చెందిన బాణావత్ రెడ్డినాయక్, సుగుణల కూతుళ్లు బాణావత్ మంజుల(17), బాణావత్ అశ్విని(19) శుక్రవారం హైదరాబాద్‌లో ఎప్‌సెట్ పరీక్ష రాసి తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లిలో అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరు మృతిచెందారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఈ విషాద ఘటనపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. మృతుల తండ్రి బాణావత్ రెడ్డినాయక్ ఉపాధి నిమిత్తం మలేషియాలో ఉన్న విషయం తెలుసుకున్న కేటీఆర్.. ఆయన వెంటనే తెలంగాణకు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే, మలేషియాలోని భారత దౌత్య అధికారులతో సమన్వయం చేయడంతోపాటు ప్రయాణ అనుమతులు, టికెట్లతో సహా అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్‌నాయక్ ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. వైద్యులు, పోలీసులు, అధికారులను సమన్వయం చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించి అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. తమకు అండగా నిలిచిన కేటీఆర్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.