కొత్తగూడెం గణేశ్ టెంపుల్, సెప్టెంబర్ 1 : సాంకేతిక విద్యను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో పాలిటెక్నిక్ విద్యార్థులు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ఏండ్ల్లతరబడి కొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యను నీరుగార్చేందుకు ప్రభుత్వం పూనుకోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. జీవో 97ను రద్దు చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.