మాదాపూర్, జనవరి 17: హైదరాబాద్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థి కే వరుణ్ చౌదరి ప్రతిష్ఠాత్మకమైన రాయల్ మిస్టర్ ఇండియా టైటిల్ను కైవసం చేసుకున్నాడు. వర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుతున్న వరుణ్ చౌదరి ఇటీవల జైపూర్లోని రాయల్ ప్రొడక్షన్ హౌస్ నిర్వహించిన ఈ పోటీల్లో విజేతగా నిలిచి సత్తా చాటాడు.
ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 90 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్నారు. 12 మంది ఫైనలిస్టుల్లో స్థానం సంపాదించడమే కాకుండా ఫైనల్ పోటీల్లో వరుణ్ టైటిల్ను గెలుచుకున్నాడు. విద్యార్థుల నైపుణ్యాలు, సామర్థ్యాలకు బహుళ రౌండ్లలో జరిగిన కఠినమైన పరీక్షల్లో వరుణ్ విశేష ప్రతిభ చాటాడని వర్సిటీ వీసీ జీ పార్థసారధి వర్మ కొనియాడారు. ఈ మేరకు వరుణ్ చౌదరిని ఆయనతోపాటు అధ్యాపకులు బుధవారం అభినందించారు. వరుణ్ గతంలో కూడా వివిధ పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విశేష ప్రతిభ చాటాడు.