ధర్మారం, అక్టోబర్ 8: జనాభా లెకల్లో తమ జనాభాను తక్కువగా నమోదు చేయడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తున్నదని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని దళితులు కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2011 నాటి జనాభా లెకల సందర్భంగా ఖిలావనపర్తి గ్రామంలో ఎస్సీలు కేవలం నలుగురు మాత్రమే ఉన్నట్టు నమోదు చేయడం, ఇతర సామాజిక వర్గాలవారు ఎక్కువగా ఉన్నట్టు చూపినట్టు వారు పేర్కొన్నారు. గ్రామ జనాభా గెజిట్ పబ్లికేషన్ కావడంతో అప్పటినుంచి స్థానిక సంస్థలు ఎన్నికల్లో తాము రిజర్వేషన్లు కోల్పోతున్నామని వాపోయారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ పోటీకి అవకాశం లేకుండా పోయిందని, తగిన విచారణ జరిపించి రిజర్వేషన్లు పునరుద్ధరించాలని కోరారు.