KCR | వేములవాడ, ఆగస్టు 19: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభిమానం వేములవాడ రాజన్న సన్నిధి సాక్షిగా బయటపడింది. ‘దుష్ట కాంగ్రెస్ పోవాలి.. మళ్లీ కేసీఆర్ పాలన రావాలనే’ ప్రజల ఆకాంక్ష కనిపించింది. సాదాసీదాగా స్వామివారి దర్శనానికి వచ్చిన కేసీఆర్ సతీమణి శోభమ్మను చూసిన భక్తజనం ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేయడమే కాకుండా, మళ్లీ మన కేసీఆర్ సార్ రావాలంటూ నినాదాలు చేసిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. భక్తులు, శివపార్వతులు స్వయంగా శోభమ్మకు ఎదురెళ్లి ఆప్యాయంగా రెండుచేతులు దగ్గరికి తీసుకొని ‘అమ్మా సార్ను బాగా చూసుకోండి. మళ్లీ మన సారే రావాలి’ అని చెప్పిన మాటలు రాష్ట్ర ప్రజల మనసుల్లో ఉన్న అభిమానానికి అద్దం పట్టాయి. కేసీఆర్ మీద ప్రజల్లో ప్రేమాభిమానాలు ఎంతగా ఉన్నాయో ఈ ఘటన నిరూపించింది. మంగళవారం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, మనుమడు హిమాన్షుతో కలిసి అత్యంత సాదాసీదాగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. రాజన్న దర్శనం అనంతరం పరివార దేవతలను కూడా దర్శించుకున్నారు.
ఈ క్రమంలో బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారిని మొక్కుకొని వస్తుండగా కొందరు మహిళా భక్తులు, శివపార్వతులు శోభమ్మను గుర్తుపట్టి ఎదురుగా వెళ్లారు. ఆమె చేతులు దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా ముచ్చటించారు. ‘అమ్మా.. కేసీఆర్ సార్ను బాగా చూసుకోండి. మన సార్ మళ్లీ రావాలి. సార్ రావాలంటే మీరు బాగా చూసుకోవాలి’ అని అభిమానం చాటుకున్నారు. ఇదే సయయంలో చాలా మంది మహిళా భక్తులు శోభమ్మను చూసి అభివాదాలు తెలపడంతోపాటు ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొకును చెల్లించుకునేందుకు ప్రదక్షిణ చేస్తున్న సమయంలోనూ భక్తులు శోభమ్మను గుర్తుపట్టి ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. ‘మళ్లీ సార్ రావాలి.. మాకు సారే కావాలి’ అంటూ ప్రజల నుంచి అభిమానం, ఆప్యాయత వ్యక్తం కావడం పార్టీ నేతలను సైతం ఉత్సాహపరిచింది. కేసీఆర్ సతీమణి శోభ, మనుమడు హిమాన్షుకు బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
రాజన్న సన్నిధిలో పూజలు
శోభమ్మ, మనుమడు, కేటీఆర్ తనయుడు హిమాన్షుకు రాజన్న సన్నిధిలో అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధానార్చకులు చంద్రగిరి శరత్ ఆధ్వర్యంలో గణనాథుడికి, శ్రీరాజరాజేశ్వరస్వామికి, పార్వతి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అద్దాల మండపంలో ఆలయ విశ్రాంత స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలతో వారికి ఆశీర్వచనం చేసి, స్వామివారి శేషవస్త్రం కప్పి, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.