Deshapathi Srinivas | తెలంగాణపై చెరగని ముద్ర కేసీఆర్.. చేతకాని వాళ్లే పేర్లు మారుస్తరు: కవి, గాయకుడు దేశపతి
తెలంగాణ కోసం సకల జనులు పోరాడుతున్నప్పుడు తెలుగు తల్లి వద్దని తెలంగాణ తల్లిని ప్రజలు ఆవిష్కరించుకున్నారు. ఇప్పుడు మళ్లీ విగ్రహాల ముచ్చట వినిపిస్తున్నది. ఒక్క విగ్రహమే కాదు రాష్ట్ర చిహ్నం మార్చాలనే ప్రయత్నమూ జరుగుతున్నది. రాష్ట్ర గీతం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని సోషల్ మీడియాలో చర్చ సాగుతున్నది.
- కాకతీయ తోరణం, చార్మినార్ నగర, గ్రామీణ జీవన ప్రతీకలు
- రాచరిక చిహ్నాలు అన్నది ఒక తొంపు
- నెహ్రూని మించినవాడా రేవంత్?
- రేవంత్ నేటికీ జై తెలంగాణ అనలే
- తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రానందుకు దేవుడికి దండం పెట్టాలి
- అందెశ్రీవి ఉద్యమ మాటలు కావు
- కేసీఆర్ ఆనవాళ్లు చెరపడం అసాధ్యం
- కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్
Deshapathi Srinivas | తెలంగాణ కోసం సకల జనులు పోరాడుతున్నప్పుడు తెలుగు తల్లి వద్దని తెలంగాణ తల్లిని ప్రజలు ఆవిష్కరించుకున్నారు. ఇప్పుడు మళ్లీ విగ్రహాల ముచ్చట వినిపిస్తున్నది. ఒక్క విగ్రహమే కాదు రాష్ట్ర చిహ్నం మార్చాలనే ప్రయత్నమూ జరుగుతున్నది. రాష్ట్ర గీతం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని సోషల్ మీడియాలో చర్చ సాగుతున్నది. తెలంగాణకు జై కొట్టనోడికి, తెలంగాణ కోసం పోరాడనోడికి తెలంగాణ తల్లి గురించి మాట్లాడే అర్హతే లేదంటున్నారు తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నుంచి తెలంగాణ తల్లి ఎలా పుట్టిందో.. రాష్ట్ర చిహ్నం ఎట్లా రూపుదిద్దుకున్నదో ఉద్యమ ముచ్చట్లను నమస్తే తెలంగాణ పాఠకులతో యాది జేసుకుంటున్నారాయన.
-నమస్తే తెలంగాణ, హైదరాబాద్
నమస్తే తెలంగాణ: తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం ఎలా ప్రవేశించింది?
దేశపతి శ్రీనివాస్: సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ సంస్కృతి వివక్షకు గురైంది. ఆ విషయాలు తెలంగాణ ఉద్యమం మాట్లాడింది. ఆ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కాకతీయుల వైభవాన్ని ప్రతి వేదికపైనా చాటుకున్నారు. ఉద్యమ కాలంలోనే సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఇలా ఉంటే బాగుంటుందని కొంతమంది ప్రతిపాదించారు. తెలంగాణ చిహ్నం ఎవరికి వారుగా రూపొందించుకున్నారు. ఉద్యమ కాలంలో ఒక చిహ్నం ప్రాచుర్యంలోకి వచ్చింది. దానికి మరొక చిహ్నం చేర్చే బాధ్యతను ఏలే లక్ష్మణ్‌కి అప్పగించి, చార్మినార్ని చేర్చాలని కేసీఆర్ సూచించాడు. కాకతీయ తోరణం, చార్మినార్.. నగర, గ్రామీణ జీవితాలకు ప్రతీకలు. కాకతీయ శిల్పాలను యునెస్కో గుర్తించింది. కానీ, రేవంత్ రెడ్డి గుర్తించట్లేదు.
రాచరిక చిహ్నాలు తీసేస్తే తప్పేంటి?
కాకతీయ కళా తోరణం కాకతీయుల కాలం నాటి శిల్పులు ప్రతిభకు ప్రతీక. రాచరిక చిహ్నాలు అన్నది ఒక తొంపు (సాకు) మాత్రమే. కేసీఆర్ ఆనవాళ్లను మలిపేయాలన్నదే ఆయన లక్ష్యం. కేసీఆర్ ఏది పెట్టిండో అది తీసేపని మొదలుపెట్టిండు. కాకతీయ తోరణం మీద వెతుక్కొని తెచ్చుకున్న తొంపు ప్రజల ముందు చెల్లదు. తెలంగాణ చిహ్నం విడుదలైనప్పుడు ఈ మాట ఎవరూ అనలేదు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఒక్కడే అంటున్నాడు. అశోకుడిని ఒకలా, కాకతీయుల్ని మరోలా ఎందుకు చూడాలి? రాష్ట్ర చిహ్నంలో ఏదైనా చేర్చితే మంచిదే. కానీ, చెరపాలనుకోవడం తప్పు. రాచరిక చిహ్నాలు ఉండొద్దంటే చర్చ భారతదేశ అధికార చిహ్నం నుంచి మొదలుపెట్టాలి. భారతదేశ రాజముద్రలోని నాలుగు సింహాలు, జాతీయజెండాలో ధర్మచక్రం సారనాథ్ స్థూపం నుంచి తీసుకున్నవి. దాని నిర్మాత అశోకుడు. ఆయన రాజే. ఆ చిహ్నాలను నెహ్రూ ఎంపిక చేశాడు.
రేవంత్‌రెడ్డి ఆ నెహ్రూని మించిన మేధావి అయ్యాడా? చిహ్నంలో చార్మినార్ ఎంపికకు కారణం?
ప్లేగువ్యాధితో మరణించిన ప్రజల స్మారకంగా కుతుబ్‌షాహీలు చార్మినార్ నిర్మించారు. ఆకాశంవైపు చేతులెత్తి అల్లాను దువా అడుగుతున్నట్టుగా చార్మినార్ కనిపిస్తుంది. సముద్రాన్ని చేపలతో నింపినట్లుగా ఈ నగరాన్ని ప్రజలతో నింపమని ఇబ్రహీం కులీ కుతుబ్‌షా అల్లాను ప్రార్థిస్తూ హైదరాబాద్ నగర నిర్మాణం చేపట్టాడు. తర్వాత కాలంలో అదే జరిగింది. రాష్ట్ర చిహ్నంలోని కాకతీయుల కళాతోరణం, చార్మినార్ తెలంగాణ గంగా జమునా సహజీవనానికి సంకేతాలు. గ్రామీణ, పట్టణ జీవనానికి ఈ రెండూ ప్రతీకలు.
కాకతీయ తోరణం ఎంపిక ఔచిత్యమేంటి?
కాకతీయ తోరణంపైన ఉన్న హంసలు పాదర్శక పాలనకు సంకేతం. సింహాలు పరాక్రమానికి, పూర్ణ కుంభాలు సౌభాగ్య చిహ్నం. స్తంభాలపై కిందివైపున మొసళ్లు ఉన్నాయి. కాకతీయులు చెరువులు తవ్వించారు. మొసళ్లు జలసంపదకు గుర్తు. తోరణంపైన చేప మత్స్య సంపదకు చిహ్నం. మన కళ, సంస్కృతి, చరిత్ర, భౌగోళికతను ఈ తోరణం ప్రతిబింబిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వా త చెరువులను బాగు చేయించింది. మత్స్య సందను పెంచింది. ఇవన్నీ కాకతీయుల నాటి కృషికి కొనసాగింపు. అందుకే కాకతీయ తోరణం ఎంపికకు ఔచిత్యం ఉన్నది.
పేర్లు, చిహ్నాల గురించి ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతున్నది. ఎందుకు?
పాలన, అభివృద్ధి చేతకాక. అభివృద్ధి చేయడం చేతగానివాళ్లే పేర్లు మార్చేస్తారంటూ బీజేపీని ఉద్దేశించి రాహుల్ గాంధీ గతంలోనే చెప్పాడు. ఆ మాటలు రేవంత్‌కూ వర్తిస్తాయి. ఢిల్లీలో అక్బర్, షాజహాన్, ఔరంగజేబు పేర్లతో వీధులున్నాయి. ఈ పేర్లు మార్చాలని బీజేపీ అన్నప్పుడు మొఘలులు ఇక్కడి వాళ్లేనని, వలస పాలకులు కాదన్నారు. మొఘలులను స్వీకరించే విశాలత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలో కాకతీయులను తిరస్కరించే సంకుచితత్వం ఉన్న రేవంత్‌రెడ్డి కూడా ఉన్నాడు.
తెలంగాణపై మాట్లాడే నైతికత రేవంత్‌కు లేదని బీఆర్ఎస్ అంటున్నది ఎందుకు?
రేవంత్‌కి తెలంగాణ ఉద్యమ భాగస్వా మ్యం లేదు. తెలంగాణలో చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తన వైఖరి చెప్పాలని జేఏసీ అడగడానికి పోతామన్నది. అప్పుడు.. ‘ఎవడ్రా మమ్మల్ని అడిగేవాడు? అడ్డొచ్చేవాడు. అడిగిన వాడిని కాల్చేస్తా’నని రైఫిల్ తీసుకుని బయలుదేరిన వాడు రేవంత్‌రెడ్డి. తెలంగాణ మీద స్పష్టమైన వైఖరి చెప్పమన్నందుకు చంద్రబాబునాయుడు న్యాయవాదుల తలలు పగులగొట్టించాడు. తెలంగాణకు అనుకూలంగా నటిస్తూ, రాష్ట్ర ఆవిర్భావాన్ని ఆపాలని చంద్రబాబుతో కలిసి మాయోపాయాలు పన్నాడు. రేవంత్‌రెడ్డి ఈరోజు వరకు జై తెలంగాణ అనలేదు. జై తెలంగాణ నినాదం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నినాదం అనుకుంటున్నాడు. అది ఆయన అవగాహనా రాహిత్యం.. ‘జై తెలంగాణ’ అనడం పుట్టిన గడ్డకు జైకొట్టడం. ఈ నినాదం 1969లోనూ ప్రతిధ్వనించింది.
కేసీఆర్‌ని మరచిపోయేలా చేయాలన్నదే సీఎం లక్ష్యమా?
అది సాధ్య కాని పని. తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ కృషి ప్రథమ గణ్యం. జయశంకర్ సార్, బియ్యాల జనార్దన్‌రావు, గద్దర్, మారోజు వీరన్న, గాదె ఇన్నయ్య వంటి నాయకుల కృషితో తెలంగాణ రాష్ట్రం కోసం తొలి ప్రయత్నాలు కొంత ముందడుగు వేశాయి. బెల్లి లలిత హత్య తర్వాత మూగబోయిన తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్ జై కొట్టడం వల్లే తెలంగాణ నినాదం రాజకీయ శక్తిగా అవతరించింది. తెలంగాణ నినాదం ఎన్నికలనే ప్రభావితం చేసే స్థాయికి చేరింది. జనం బహిష్కరిస్తారేమోనని విధిలేక మిగతా పార్టీల నేతలు తెలంగాణకు జై కొట్టారు. తెలంగాణ వాణిని పార్లమెంట్ దాకా తీసుకుపోయింది కేసీఆరే. దేశవ్యాప్తంగా తిరిగి పార్టీల మద్దతు కూడగట్టింది కేసీఆరే. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. ఒక అంకుశమై కాంగ్రె స్ నేతల్ని నిరంతరం పొడిచాడు. వీటి ఫలిత మే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ సాధన కో సం కొండంత కృషి, సముద్రమంత దోహదం కేసీఆర్‌ది! కేసీఆర్ ఆనవాళ్లు చెరపాలనుకునే రేవంత్ రైతుబంధు ఆపేస్తానని అనగలడా?
జయజయహే గీతానికి సంగీతం అందించేంతటి కళాకారులు తెలంగాణలో లేరా?
రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర కళాకారులతో రూపొందించడమే ఔచిత్యం. తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వకపోగా గీత రచయిత తెలంగాణ కళాకారులను తక్కువ చేసి మాట్లాడటం ఆక్షేపణీయం. తెలంగాణ ఉద్యమంలో పాటలు ఉత్ప్రేరకంగా పనిచేశాయి. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో అనేకమంది కవిగాయకుల పాత్ర ఉంది. జయజయహే పాటకు బాణీ ఉన్నది. దానికి వాద్య కల్పన చేయడానికి అర్హమైన కళాకారులు, తెలంగాణలో సంగీత దర్శకులు ఎందరో ఉన్నారు. లేరన్నది నిజం కాదు. అందెశ్రీ వంటి ఉద్యమ కవి అనకూడని మాటలవి.
రేవంత్‌రెడ్డి బలం, బలగం ఎవరై ఉంటారు?
చంద్రబాబుని అనుసరించిన ఇండస్ట్రియల్ లాబీ, పెట్టుబడిదారుల కూటమి అండదండలు రేవంత్‌రెడ్డికి పుష్కలంగా ఉన్నాయి. అవే నిన్నటి ఎన్నికల్లో రేవంత్‌కి పెట్టుబడులు సమకూర్చాయి. రేవంత్‌రెడ్డి విజయోత్సవంలో తెలుగుదేశం జెండాలు అగ్రభాగాన ఉన్నాయి. ఆయన దావోస్ పర్యటనకు పోతే తెలుగుదేశం పార్టీ జెండాలు స్వాగతం పలికాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు పోయి ‘మా కాంగ్రెస్ వాళ్ల కంటే మీరే గెలుపు కోసం ఎక్కువగా కష్టపడ్డారు’ అని ప్రశంసించాడు. చంద్రబాబునాయుడిని అభిమానించేవాళ్లు రేవంత్‌రెడ్డి సీఎం కావాలని కోరుకున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అవశేషాలు కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని బతుకుతున్నాయి. రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలోకి రానందుకు దేవుడికి దండం పెట్టాలి. ఆయన వచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రం రాకపోయేది.
తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ప్రజలు ఆమోదిస్తారా?
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకాలంలో ఉద్యమ కార్యాచరణ, సాంస్కృతిక కార్యాచరణ వేర్వేరుగా లేవు. ఉద్యమం, సాంస్కృతిక ఉత్సవం ఏకకాలంలో కలగలిసి సాగాయి. బతుకమ్మ పోరాట రూపమైంది. గ్రామాల్లో, పట్టణాల్లోనే జరిగే బతుకమ్మ పండుగను నగరాల్లో ఘనంగా జరుపుకొన్నారు. షికాగో, న్యూయా ర్క్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు విస్తరించింది. ఉద్యమంలోకి బోనాల ప్రదర్శన వచ్చింది. వంటావార్పు కార్యక్రమంలో హైదరాబాద్‌లో రోడ్డు మీద తెలంగాణ తల్లి కూర్చుని వంట చేస్తున్నట్టు పోస్టర్ రూపొందించాం. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటుకోవాలనే తాపత్రయం నుంచి జరిగిన ప్రయత్నం అది. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఉద్యమ రూపమని గుర్తించాలి. రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఫలానాలా ఉన్నదని అంటున్నాడు. భారతీయ సంస్కృతిలో దేవతలందరూ కిరీటాలు కలిగి ఉన్నారు. సరస్వతీ, లక్ష్మీదేవిలాగా కిరీటం, నగలతో దైవ స్వరూపంలాగా ఉంది. ఇంతకుముందు తెలుగుతల్లికి కూడాకిరీటం ఉన్నది. తెలంగాణతల్లి అనే భావన, రూపం ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చాయి. తెలంగాణ తల్లి మొదటి విగ్రహ ఆవిష్కరణ సభలో జయశంకర్ సార్, కోదండరామ్ ఉన్నారు. ఇప్పుడున్న రూపంలోనే ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణలు జరిగాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రజామోదం ఉన్నది. అప్పుడు తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ తల్లి, తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి. చేతిలో అధికారం ఉన్నదని కొత్తగా మరో విగ్రహం ప్రతిష్ఠిస్తే అది ప్రభుత్వం చేసిన ప్రతిష్ఠ అవుతుంది. కానీ, ప్రజలు ప్రతిష్ఠించుకున్నట్టు కాదు. తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్‌రెడ్డికి తెలంగాణ తల్లి గురించి మాట్లాడే ఆ నైతిక అర్హత లేదు.
– ఇంటర్వ్యూ: నాగవర్ధన్ రాయల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

