హైదరాబాద్, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ): మాజీ సీఎం కేసీఆర్ అద్భుతమైన విజన్ ఉన్న వ్యక్తి అని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు అత్యద్భుతమైన సచివాలయాన్ని అందించారని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ పొన్నీ ఎం కాన్సెసావో కొనియాడారు. కేసీఆర్ ప్రతిభను నమ్మే వ్యక్తి అని, ఆయన సర్కారులో లంచాలకు ఆస్కారం లేదని ఆమె పేర్కొన్నారు. అందుకే దేశంలోని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లతో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ సచివాలయానికి డిజైన్లు రూపొందించే అవకాశం తమకు దక్కిందని చెప్పారు. ఆస్కార్ అండ్ పొన్నీ ఆర్కిటెక్ట్స్ సహ వ్యవస్థాపకురాలు, సచివాలయానికి డిజైన్లు రూపొందించిన ముఖ్య ఆర్కిటెక్ట్ పొన్నీ ఎం కాన్సెసావో తాజాగా మీడియా దిగ్గజం జెన్నిఫర్ ఆరుల్కు ఇచ్చిన ఇంటర్యూలో కేసీఆర్ పాలనను ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణకు అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించే అవకాశం లభించడం, ముఖ్యంగా కేసీఆర్ వద్ద పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.
దేవుడి దయవల్ల తమకు ఈ భాగ్యం లభించిందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ‘తెలంగాణ సచివాలయం సుమారు రూ. 1200 కోట్ల ప్రాజక్టు. దాదాపు 10-12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనాన్ని రెండేళ్లలో పూర్తిచేశాం. కేసీఆర్ వంటి గొప్ప ముఖ్యమంత్రితో పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఇంతటి గొప్ప సచివాలయానికి ప్రిన్స్‌పల్ ఆర్కిటెక్ట్‌గా డిజైన్లు ఇచ్చి, నిర్మించే భాగ్యం లభించిన ఏషియాలోనే మొదటి మహిళను కావడం గర్వంగా ఉంది. ఈ విషయం నాకు మీడియా ద్వారా తెలిసింది. నేను ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. తెలంగాణ సచివాలయం ఎంతో అందమైన, గొప్ప నిర్మాణంగా పేరుగాంచింది. డిజైన్ల రూపకల్పనకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్స్ ఆర్కిటెక్ట్‌ను ఎంపికచేసేందుకు దేశంలోని 20-30మంది ప్రముఖ ఆర్కిటెక్ట్‌లను పిలిచారు. ఇది ఎంతో ఒత్తిడితో కూడిన పోటీ. అందులో నన్ను ఎంపికచేయడం ఎంతో లక్కీగా భావిస్తున్నా’ అని పొన్నీ పేర్కొన్నారు.
తీవ్రమైన పోటీలో కాంట్రాక్టు దక్కించుకునేందుకు లంచం ఇవ్వాల్సిరాలేదా? ఎలా మేనేజ్ చేశారు? అని పొన్సీని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని ఆమె స్పష్టంచేశారు. ఆర్కిటెక్ట్‌ల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరిగిందని, దీని క్రెడిట్ అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకి ఇవ్వక తప్పదని పేర్కొన్నారు. ఆయన ప్రతిభను నమ్మే గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు. ప్రభుత్వ భవనాలను సహజంగా మూస పద్ధతిలో నిర్మిస్తారని, కానీ అప్పటి సీఎం కేసీఆర్ మాత్రం తమ రాష్ర్టానికి సకల సౌకర్యాలతో, అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉండే విధంగా ఓ అద్భుతమైన విజన్‌తో సచివాలయాన్ని నిర్మించారని చెప్పారు.
నిర్మాణాలను ఎప్పటికప్పుడు తానే స్వయంగా పర్యవేక్షించేవారని పేర్కొన్నారు. అంతేకాదు, డిజైన్ల దగ్గర్నుంచి నిర్మాణం పూర్తయ్యేవరకు అన్ని బాధ్యతలు చూసేందుకు ఓ ఉన్నతస్థాయి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రభుత్వాధినేతగా అన్ని అంశాలనూ ఆయన ఎంతో శ్రద్ధగా పరిశీలించేవారని గుర్తుచేశారు. కేసీఆర్ పర్యవేక్షణలో, టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో తాము పనిచేసినట్టు తెలిపారు. కేసీఆర్ ఎంతో శ్రద్ధతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ, ఏ లోటూ లేకుండా భవనాన్ని అత్యాధునిక పద్ధతిలో నిర్మించాలనే సంకల్పంతో ఈ డిజైన్‌ను ఎంపిక చేశారని చెప్పారు.
గతంలోని పాత సచివాలయంలో 40కిపైగా భవనాలు ఉన్నప్పటికీ అందులో ఫైర్ సేఫ్టీ సహా అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని పొన్నీ పేర్కొన్నారు. ఒక క్రమపద్ధతిలో కాకుండా ఒక్కో శాఖ ఒక్కో భవనంలో ఉండేదని పేర్కొన్నారు. దీంతో మంత్రులు, అన్ని శాఖల విభాగాధిపతులు, అన్ని శాఖల కార్యాలయాలు ఒకే గూటికింద ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ నూతన సచివాలయానికి అంకురార్పణ చేశారని వివరించారు. ఆయన విజన్‌కు అనుగుణంగా సచివాలయ డిజైన్లను రూపొందించినట్టు పేర్కొన్నారు. అన్ని శాఖలు ఒకే భవన సముదాయంలో ఉండే విధంగా సచివాలయాన్ని నిర్మించామని, అది ఒక అద్భుతమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్‌గా పేరు గాంచిందని పొన్నీ వివరించారు.
తెలంగాణ సచివాలయం ఓ ప్రాజక్టు మాత్రమే కాదని, అది తెలంగాణ ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబించే ఓ మైలురాయి వంటిదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గొప్ప దార్శనికతతో ప్రణాళికలు రూపొందించి, సాంకేతిక కమిటీ మార్గదర్శకత్వంలో దాన్ని నిర్మించినట్టు ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. నిర్మాణం సరిగ్గా జరుగుతుందా, లేదా అని నిర్ధారించుకోడానికి కేసీఆర్ స్వయంగా అనునిత్యం పర్యవేక్షించే వారని తెలిపారు. కేసీఆర్ వ్యక్తిత్వం, ఆయన విజన్ గురించి తన అనుభవాలను పంచుకున్నందుకుగాను ఆర్కిటెక్ట్ పొన్నీ ఎం కాన్సెసావోకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.