నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 26: ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన సీఎం కేసీఆర్కు లేదని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ విపక్ష నాయకులు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆదివారం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన బాజిరెడ్డికి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో సీఎం కేసీఆర్ ఆర్టీసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఒకే రూట్లో ఎక్కువ సంఖ్యలో బస్సులు తిరగ డం, హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లెవెలుగు సర్వీసుల ద్వారా ఆశించిన ఆదాయం రావడం లేదన్నా రు. ఆర్టీసీకి సీఎం కేసీఆర్ ఏడాదికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తున్నారని తెలిపారు. కరోనా వ్యాప్తికి ముందు ఆర్టీసీకి రూ.14 కోట్ల ఆదా యం రాగా, ఆ తరువాత నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆదాయం రూ.3 కోట్లకు పడిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలను పెంచడంతో సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో 9 వేల ఆర్టీసీ బస్సులు ఉండగా అందులో 6 వేల బస్సులు ప్రభుత్వం తరఫున, 3 వేల బస్సులు ప్రైవేట్ యాజమాన్యం ద్వారా నడుస్తున్నాయని వివరించారు. కార్గో సేవల ద్వారా ఆర్టీసీకి తగిన ఆదాయం సమకూరుతున్నదని, మరో వెయ్యి కార్గో బస్సులను నడిపేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.