హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): కార్మికుల రెకల కష్టానికి వెలకట్టలేమని, వారి త్యాగం అసామాన్యమైనదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడేను పురసరించుకుని కార్మిక, శ్రామిక, కర్షక లోకానికి ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. మేడే సందర్భంగా అమరులైన కార్మికుల త్యాగాలకు ఘనంగా నివాళులర్పించారు. మేడే స్ఫూర్తితో రాష్ట్రంలోని శ్రామికుల హకులను కాపాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు వారి జీవన భద్రతకు భరోసా పెంచాయని తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలను అమలు చేసి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. ఉత్పత్తి, సేవారంగాల్లో పనిచేసే మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలను, హకులను కల్పించి అండగా నిలిచామని తెలిపారు.
సింగరేణి కార్మికులు, ఆటోడ్రైవర్లు, పలు పరిశ్రమలు సహా అసంఘటితరంగ కార్మికులకు అన్నిరకాలుగా భరోసా కల్పించామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్మికవర్గ అనుకూల విధానాలను మరింత బలోపేతం చేయడం, వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేయడం మాత్రమే మేడే స్ఫూర్తికి, ప్రపంచ కార్మికలోక త్యాగాలకు మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ తెలిపారు.