హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనసభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని, కానీ తాము అవకాశం ఇవ్వాలనుకోవడంలేదని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. శనివారం శాసనసభ లాబీల్లో మీడియాతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలకు పీపీటీ ఇచ్చే సంప్రదాయంలేదన్నారు.
అప్పులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, తాము అన్ని వివరాలను శాసనసభ వేదికగానే బయటపెడుతామని చెప్పారు. అప్పులపై కడుతున్న వడ్డీ రూ.2300 కోట్లు మాత్రమేనని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారని, అసలు ఎంత కడుతున్నామో వారికి కూడా తెలుసని అన్నారు.
శనివారం శాసనసభలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రుల వద్దకు వెళ్లి.. తమ నియోజకర్గాలకు కనీసం అభివృద్ధి నిధులు కూడా ఇవ్వడంలేదని వాపోయారు. నియోజకవర్గ నిధి ఇచ్చి, అభివృద్ధికి సహకరించాలని కోరారు.
కొంతమంది ఎమ్మెల్యేలు ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క వద్దకు వెళ్లి.. రెండేండ్లుగా తమకు ప్రత్యేకంగా నిధులు రాలేదని, నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే.. నిధులు లేవని అధికారులు చెప్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజల నుంచి తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నదని, ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని తెలిపారు. వీలైనంత త్వరగా తమకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని వేడుకున్నారు.