కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ పోరాట సమితి వెల్లడి
కాజీపేట, సెప్టెంబర్ 19: కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో త్వరలోనే వ్యాగన్ (పీవోహెచ్) షెడ్ పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ పోరాట సమితి తెలిపింది. డివిజన్ పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలో సభ్యులు శనివారం రాత్రి హైదరాబాద్‌లో వినోద్‌కుమార్‌ను కలిసి పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు ఆదివారం కాజీపేటలో మీడియాతో మాట్లాడారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ నిర్మాణానికి రైల్వే డీఆర్ఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చిన విషయం వినోద్‌కుమార్ తెలిపారన్నారు.