హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యుత్తు విచారణ కమిషన్ నూతన చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ లోకూర్ ఉమ్మడి ఏపీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. విద్యుత్తు కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ నర్సింహారెడ్డి స్థానంలో జస్టిస్ లోకూర్ వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డితో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ నర్సింహారెడ్డి విద్యుత్తు అంశంపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఏకపక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేశారు. విచారణకు హాజరు కావాలని కేసీఆర్‌ను నోటీసులు జారీచేశారు. ఆ కమిషన్ విచారణను సవాల్‌చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు జూలై 16న విచారణ జరిపింది. ఇరుపక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో విచారణ కమిషన్ నుంచి తప్పుకుంటున్నట్టు సుప్రీంకోర్టుకు జస్టిస్ నర్సింహారెడ్డి లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం సమయం ఇచ్చింది. దీంతో జస్టిస్ లోకూర్‌ను నూతన చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
జస్టిస్ లోకూర్ సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం న్యాయమూర్తిగా పనిచేశారు. ఢిల్లీలో 1953 డిసెంబర్ 31న ఆయన జన్మించారు. 1977లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ డిగ్రీ పొందారు. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, రెవెన్యూ, సేవల చట్టాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్నది. గతంలో ఆయన అదనపు సొలిసిటర్ జనరల్‌గా, ఢిల్లీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2011 నవంబర్ 15 నుంచి 2012 జూన్ 3 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.