హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎన్జీవో సంఘం పూర్వ అధ్యక్షుడు స్వామినాథన్(83) శుక్రవారం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని స్పర్శ్ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య స్వామినాథన్ స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట సమీపంలోని కొండనాగుల గ్రామంలో అంత్యక్రియలు ముగిశాయి. టీఎన్జీవోకు సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన స్వామినాథన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేశారు.
చిన్న వయస్సులోనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరి టీఎన్జీవోలో అంచెలంచెలుగా ఎదిగారు. కొంతకాలం పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, 1978లో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై 2002 వరకు సుదీర్ఘకాలం పనిచేశారు. 610 జీవో సాధన, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆరు సూత్రాల పథకం వంటి అనేక పరిణామాలు స్వామినాథన్ టీఎన్జీవో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే చోటుచేసుకొన్నాయి. 1986లో పీఆర్సీ సాధనకు ఎన్జీవోలు సమ్మెకు దిగగా ప్రభుత్వం స్వామినాథన్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన ఒక్క అర్జీ కూడా సమర్పించలేదు. చివరకు ప్రభుత్వమే దిగివచ్చి విధుల్లోకి తీసుకొన్నది.
1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ‘అవినీతి ఉద్యోగులను చెట్టుకు కట్టి కొట్టండి’ అన్న పిలుపుకు ప్రతిస్పందనగా ‘తమరి మంత్రివర్గంలో అవినీతి మచ్చలేని వారుంటే చెప్పండి. వారి కాళ్లుకడిగి నెత్తినపోసుకుంటాం’ అని ప్రకటించి సంచలనానికి మారుపేరుగా నిలిచారు. ‘ఉద్యోగులు పందికొక్కులు, వారి జీతాలకే ప్రభుత్వ ఖాజానా ఖాళీ అవుతున్నది’ అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించగా.. ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఏపీ ఎన్జీవోస్తో కలిసి ఉద్యమాలు చేస్తూనే, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాతీయ ఫోరాన్ని స్థాపించి సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. 1997 జూన్‌లో పదవీ విరమణ పొందగా, మరో ఐదేండ్లు పొడిగించడంతో 2002 వరకు కొనసాగారు.
స్వామినాథన్ మృతిపట్ల పలువురు సంతాపం ప్రకటించారు. టీఎస్పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్‌రెడ్డి, టీఎన్జీవో సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్, పూర్వ అధ్యక్షులు జీ దేవీప్రసాద్, స్వామిగౌడ్, సుధాకర్ తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. టీజీవో అధ్యక్షప్రధాన కార్యదర్శులు వీ మమత, ఏ సత్యనారాయణ ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.