JEE Advanced | హైదరాబాద్ మే 18 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పేపర్-2 కఠినంగా ఉన్నదని విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పేపర్-1తో పోల్చితే పేపర్-2లో ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని చెబుతున్నారు.
ఒక్కో సబ్జెక్ట్‌లో 16 ప్రశ్నలే ఇచ్చినప్పటికీ న్యూమరికల్ బేస్డ్గా అడగడంతో సాధనకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నదని విశ్లేషించారు. ప్రతిభావంతులైన విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పటికీ అవి తప్పా? ఒప్పా? అనే విషయంలో సందిగ్ధత నెలకొన్నదని తెలిపారు. సుమారు 42 ప్రశ్నలు గణితాధారితంగా ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంగా 300 మార్కుల వరకు సాధించిన విద్యార్థులు జాతీయస్థాయిలో టాప్ టెన్ ర్యాంకు పొందే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు.