హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): గిరిజన పోరాట యోధుడు బిర్సాముండా జయంతిని పురస్కరించుకొని ప్రభు త్వం మూడు రోజులపాటు నిర్వహిస్తున్న జన జాతీయ గౌరవ్ దినోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమశాఖ ప్రాంగణంలోని నెహ్రూ మ్యూజియంలో జరిగిన కార్యక్రమాలకు గిరిజన సహకారసంస్థ చైర్మన్ వాల్యా నాయక్, జీసీసీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ అతిథులుగా హాజరయ్యారు.
గిరిజన స్వాతంత్య్ర సమరయోధులైన రాంజీ గోండ్, కుమ్రం భీమ్, బీర్సా ముండా, సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన చిత్రాలు, దారు శిల్పాలు, లోహ శిల్పాలు, ఎంబ్రాయిడరీ, తెలంగాణ దరీ మొదలైన హస్తకళల ప్రదర్శనను తిలకించారు. గిరిజన కళాకారులు సాంస్కృతిక రూపాలను ప్రదర్శించాయి. మేడారం జాతర చైర్మన్ కొరిబెల్లి శివయ్య ఆధ్వర్యంలో చేయించిన కోయధర్మ స్తంభాన్ని మ్యూజియంలో ప్రతిష్ఠించారు. కుమ్రం భీమ్ వారసుడు కుమ్రం సోనేరావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కనక రాజు, సకినె రామచంద్రయ్యను సత్కరించారు. కార్యక్రమంలో గిరిజన సాంస్కృతిక శిక్షణ పరిశోధన సంస్థ సంచాలకుడు వీ సర్వేశ్వర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శంకర్, జీసీసీ జీఎం సీతారామ్ పాల్గొన్నారు.