Telangana | సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే హైదరాబాద్, బెంగళూరుతో పాటు ఇతర పెద్ద పట్టణాలు, విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ.. తెలంగాణ సిద్ధించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లా కేంద్రాల్లో సైతం ఐటీ టవర్ల నిర్మాణంతో సాఫ్ట్వేర్ కొలువులు అందుబాటులోకి వచ్చాయి. అమ్మానాన్నలకు, ఇంటి వాతావరణానికి దూరంగా ఉంటూ ఉన్నత చదువులు చదివిన యువతకు మన దగ్గరే ఐటీ కొలువులు దొరుకుతుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. తొలి విడుతలో 16 కంపెనీలు 170 మందికి వివిధ కేటగిరీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించాయి. రాబోయే రోజుల్లో మూడు షిఫ్టుల్లో పని చేస్తే 3,400 మంది, రెండు షిఫ్టుల్లో అయితే 2,300మంది, ఒక షిఫ్టులో 1,500 మంది పని చేయడానికి అవకాశం ఉన్నది. త్వరలో ఆయా కంపెనీలు రెండో విడుతలో నిర్వహించే జాబ్‌మేళాలో ఆయా ఉద్యోగాలను భర్తీ చేయనుండగా స్థానిక యువతకు సొంత ఊళ్లోనే ఉద్యోగాలు దక్కనున్నాయి.
హనుమకొండ జిల్లాలోని మడికొండ మరో మాదాపూర్‌గా మారుతున్నది. సీఎం కేసీఆర్ హైదరాబాద్ తర్వాత వరంగల్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మడికొండ శివారులో సుమారు 45 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఐటీ పారులో ప్రఖ్యాత ఐటీ కంపెనీల స్థాపనకు కృషి చేశారు. మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో జెన్పాక్ట్, టెక్ మహేంద్ర, సైయెంట్, కాకతీయ, వెంటాయిస్, క్వాడ్రంట్ వంటి కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇంక్యుబేషన్ సెంటర్లో జెన్పాక్ట్, టెక్ మహేంద్ర కంపెనీల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ రెండు వేల మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు.
నా చదువంతా నల్లగొండలోనే సాగింది. ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లా. వివాహం కావడంతో మళ్లీ నల్లగొండకే రావాల్సి వచ్చింది. టీచర్‌గా పనిచేశా. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఐటీ టవర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహించడంతో హాజరయ్యా. ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యి కోణం ఫౌండేషన్‌లో డాటా ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించా. దీంతో నా భర్త, అమ్మానాన్న, అత్తామామలు చాలా సంతోషంగా ఉన్నారు.
– గునుశెట్టి శ్వేతానాయుడు, కోణం ఫౌండేషన్ డాటా ఇంజినీర్, నల్లగొండ
మెట్రోపాలిటన్ నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే రూ.60 వేల నుంచి రూ.లక్షకు పైగా జీతం వస్తుంది. కానీ ఖర్చులు కూడా అంతే ఉంటాయి. సొంత జిల్లాలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడంతో సంతోషంగా జాబ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు కూడా తకువే. హైదరాబాద్ వంటి నగరాల్లో ఆఫీస్‌కు వెళ్లాలంటే పెద్ద ప్రహసనం. ఇక్కడయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లి రావొచ్చు.
– దివాకర్‌రెడ్డి, ఐటీ ఉద్యోగి, వెంటాయిస్ ఐటీ సొల్యూషన్
మాది నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో సంస్థలో ఉద్యోగంలో చేరాను. ఆ క్రమంలోనే డాటా సైన్స్ కోర్సు నేర్చుకున్నా. నల్లగొండలో ఐటీ టవర్‌లో ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహించడంతో ఇంటర్వ్యూలకు హాజరయ్యా. డాటా సైన్స్‌లో ఉద్యోగం వచ్చింది. ఇక్కడే జాబ్ చేస్తూ సొంతూరుకు వెళ్తూ అమ్మానాన్నలకు ఆసరాగా ఉంటున్నా. ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– జూలకంటి ఉదయ్‌కిరణ్‌రెడ్డి, డాటా సైంటిస్ట్, ఐటీ హబ్, నల్లగొండ
…?చిలువేరు సంతోష్