హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌కు జేఎన్టీయూ హైదరాబాద్ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 5న జరగనున్న 12వ స్నాతకోత్సవంలో దీనిని ఆయన అందుకోనున్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లపై బుధవారం యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా 54 మం దికి బంగారు పతకాలు, 142 మందికి పీహెచ్డీ ప ట్టాలు, 88,226 మందికి డిగ్రీ పట్టాలు అందించనున్నట్టు చెప్పారు. పూర్వ విద్యార్థుల నిధులతో యూనివర్సిటీలో గోల్డెన్ జూబ్లీహాల్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ యూఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో 183 కంపెనీలు ఒప్పందం చేసుకోగా, 22,300 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించినట్టు చెప్పారు.
ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌కు జేఎన్టీయూ ఆతిథ్యం ఇవ్వబోతున్నట్టు ప్రొఫెసర్ నరసింహారెడ్డి తెలిపారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్‌హుస్సేన్, యూనివర్సిటీ హెచ్వోడీలు పాల్గొన్నారు.