Maha Kumbh Punya Kshetra Yatra | త్వరలోనే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా మొదలవనున్నాయి. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా మొదలై.. దాదాపు 45 రోజుల పాటు సాగనున్నది. ఈ కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు చేయనున్నారు. ఈ సారి ఉత్సవానికి ఈ సారి దాదాపు 40కోట్ల మందికిపైగా వస్తారని అంచనా. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే ఈ మహా కుంభమేళాకు మీరు కూడా వెళ్లానుకుంటున్నారా..? అయితే, మీకో గుడ్‌న్యూస్. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు హాజరవడంతో పాటు వారణాసిలో కొలువైన కాశీ విశ్వేశ్వరుడు, అయోధ్య రామయ్య దర్శనం చేసుకునే వీలు కల్పిస్తున్నది ఐఆర్సీటీసీ టూరిజం. కుంభమేళా సందర్భంగా ‘మహా కుంభ్ పుణ్య క్షేత్ర యాత్ర’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. మహా కుంభ్ యాత్రలో పర్యటన ఎనిమిది రోజులు, ఏడు రాత్రులు సాగుతుంది. జనవరి 20న ప్రారంభమవుతుంది.
కుంభ్ యాత్ర టూరిజం ప్రత్యేక ప్యాకేజీలో పర్యటన సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. 20న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో భారత్ గౌరవ్ రైలు బయలుదేరుతుంది. ప్యాకేజీలో భాగంగా కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండి, తూని, దువ్వాడ, విజయనగరం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, టాటానగర్ మీదుగా ప్రయాణం సాగుతుంది. మూడురోజు మధ్యాహ్నం ఒంటిగంట వరకు రైలు బెనారస్ చేరుకుంటుంది. రైల్వేస్టేషన్ నుంచి హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం గంగాహారతిని వీక్షిస్తారు. రాత్రి వారణాసిలోనే బస ఉంటుంది. ఇక నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని వారణాసి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాగ్‌రాజ్ బయలుదేరి వెళ్తారు. ప్రయాగ్‌రాజ్ చేరుకున్న తర్వాత సొంత ఖర్చులు భరించి కుంభమేళా జరిగే స్థలానికి వెళ్తారు. రాత్రి ప్రయాగ్‌రాజ్‌లోనే బస ఉంటుంది. ఐదోరోజు మళ్లీ ప్రయాగ్రాజ్నుంచి రోడ్డు మార్గం ద్వారా వారణాసికి చేరుకుంటారు. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ అమ్మవార్ల దర్శనం ఉంటుంది. ఆ రోజు వారణాసి నుంచి మధ్యాహ్నం వరకు అయోధ్యకు చేరుకుంటారు. రామ్ మందిర్, హనుమాన్ ఘర్హిలో దర్శనాలు చేసుకొని రాత్రి తిరిగి ప్రయాణం మొదలవుతుంది. డిన్నర్ రైలులోనే ఉంటుంది. ఏడోరోజు టాటానగర్, బాలాసోర్ మీదుగా రైలు ప్రయాణం ఉంటుంది. ఎనిమిదో రోజుఉదయం 8 గంటలకు విజయనగరం చేరుతుంది. సికింద్రాబాద్‌కు రాత్రి 11.30 గంటలకు రైలు చేరుకుంటుంది. దాంతో ప్యాకేజీలో పర్యటన ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ మహా కుంభ్ పుణ్యక్షేత్ర యాత్రలో మూడు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎకానమీ, స్టాండర్డ్ (థర్డ్ ఏసీ), కంఫర్ట్ (2ఏసీ)లో ప్రయాణం ఉంటుంది. ఎకానమీ క్లాస్ ప్యాకేజీ ధర రూ.22635, ఐదునుంచి 11ఏళ్లలోపు పిల్లలకు రూ.21,740గా ధర నిర్ణయించారు. థర్డ్ ఏసీలో ధర రూ.31,145, పిల్లలకు రూ.30,095.. సెకండ్ ఏసీలో ధర రూ.38,195.. పిల్లలకు రూ.39,935గా నిర్ణయించింది. రైలులో మొత్తం 271 సీట్లు ఉండగా.. 105 స్లీపర్, 116 థర్డ్ ఏసీ, 50 సెకండ్ ఏసీ బెర్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఎకానమీ క్లాస్ పర్యాటకులకు నాన్ ఏసీ గదుల్లో వసతి, నాన్ ఏసీ వాహనాల్లో ప్రయాణం ఉంటుంది. స్టాండర్డ్ కేటగిరిలో పర్యాటకులకు ఏసీ గదుల్లో వసతి, నాన్ ఏసీ వాహనాల్లో ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్ కేటగిరిలోని పర్యాటకులకు ఏసీ గదుల్లో వసతి, ఏసీ వాహనాల్లోనూ ప్రయాణం కల్పిస్తారు. ప్యాకేజీలో మార్నింగ్ టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌తో పాటు వసతి ఉంటుంది. పర్యాటకులకు ఇన్సూరెన్స్ సైతం వర్తిస్తుంది. వివరాలకు irctctourism.comలో సంప్రదించాలని ఐఆర్సీటీసీ కోరింది.