Alampur | అలంపూర్, డిసెంబర్ 18 : జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూతురి వివాహ వేడుకలో వివాదం చోటుచేసుకున్నది. అయితే రెండు కోణాల్లో వార్తలు హల్చల్ అవుతున్నాయి. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే కూతురికి అధికారిగా ఎంపికైన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. పెద్దలు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఏపీలోని గుంటూరు పట్టణంలోని పట్టాభిపురంలోగల డాన్‌బాస్కో చర్చిలో మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు వేడుక జరగాల్సి ఉన్నది.
తెలంగాణ ప్రాంత వివాహ సంప్రదాయం ప్రకారం వరుడి ఇంటికి నేరుగా వెళ్లకుండా ఇంటికి కొంత సమీపంలో విడిది చేయాలి. అక్కడి నుంచి వరుడి తరపు బంధువులు వచ్చి పెండ్లి కూతురు తరపు వారిని మర్యాద పూర్వకంగా ఆహ్వానించాల్సి ఉన్నది. సంప్రదాయం ప్రకారం హూందాకు తగ్గట్టు పెండ్లి కుమారుడి తరపు వారు కారు సమయానికి పంపడం లేటయ్యిందనే కారణంతో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నది. స్థానిక పోలీస్ యంత్రాంగం కలుగజేసుకుని ఉద్రిక్తతను సద్దుమణిగించినట్టు సమాచారం. కాగా మరో విధమైన గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
పెండ్లి ఇంటి నుంచి వివాహ వేదిక వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలతో ఊరేగింపుగా వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే తరఫు బంధువుల డిమాండ్‌కు వరుడి తరఫు వారు ఒప్పుకోలేదని.. దీంతో ఇరుకుటుంబాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పెండ్లికూతురి తల్లి కొంత అస్వస్థతకు గురవడంతో వేడుక ఒకరోజు వాయిదా పడింది. ఇరువర్గాల బంధువులు, పెద్దలు సంప్రదింపులు జరిపి సర్దిచెప్పడంతో బుధవారం వారి మత సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరిగింది. ప్రశాంత వాతావరణంలో పెండ్లి వేడుకలు ముగియడంతో ఇరువర్గాల వారు ఊపిరి పీల్చుకున్నారు.